శ్రీశైలం: దోర్నాల– శ్రీశైలం ఘాట్‌లో శిఖరం సమీపంలో ఉన్న మలుపు వద్ద రోడ్డు పక్కన ఆదివారం రాత్రి చిరుత పులి కనిపించింది. గమనించిన వాహనదారులు భయంతో కిందకు దిగకుండా కేకలు వేస్తూ డిమ్ అండ్ డిప్ లైట్ కొట్టడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. కాగా అటవీ శాఖ వారు ఘాట్ రోడ్‌లో శ్రీశైలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలను జారీ చేశారు. వేసవి కాలం కావడంతో రాత్రి సమయంలో అడవిలోని వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి రోడ్డు మార్గాలను దాటుతుంటాయని వాహనదారులు తక్కువ స్పీడ్‌లో వెళ్లాలని సూచించారు. ఒకవేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపి వేయాలని చెప్పారు.
జొన్న కొనుగోలుకు
మార్గదర్శకాల జారీ
నంద్యాల(అర్బన్): రబీ 2025–26లో సాగు చేసిన జొన్న పంట కొనుగోళ్లకు మార్గదర్శకా లు జారీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ అశ్వర్థ నారాయణ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు కొనుగోళ్లు ఉంటాయని, హైబ్రీడ్ రకం క్వింటా రూ.3,699గా ధర నిర్ణయించడమైనదన్నారు. రైతులు తమ పంట విక్రయానికి ముందు తప్పని సరిగా ఈ క్రాప్ నమోదుతో పాటు ఈకేవైసీ పూర్తి చేసి సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. ఆన్‌లైన్ విధానంలో మాత్రమే కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు.
పెరిగిన ‘తర్తూరు’హుండీ ఆదాయం
జూపాడుబంగ్లా: తర్తూరుజాతరను పురస్కరించుకుని శ్రీలక్ష్మీరంగనాథస్వామి, అమ్మవార్ల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. సోమవారం దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఈఓ సాయికుమార్ అధ్వర్యంలో నంద్యాల పట్టణానికి చెందిన బాలాజీ సేవా ట్రస్టు సభ్యులు నగదును లెక్కించగా రూ.16,11,871 ఉంది. గతేడాది రూ.11,21,770 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.4,90,101 అదనంగా వచ్చినట్లు ఈఓ తెలిపారు. కాగా కానుకల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణకు 21 మంది ఎంపిక
నంద్యాల(న్యూటౌన్): ఎవరెస్ట్ బేస్ క్యాంపు శిక్షణకు మొత్తం 21మంది ఎంపికై నట్లు డీఈఓ జనార్ధన్‌రెడ్డి, సమగ్ర శిక్ష అదనపు జిల్లా కో ఆర్డినేటర్ నిత్యానందరాజు తెలిపారు. ఎంపికై న వారిలో నంద్యాల జిల్లాకు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం వారిని అభినందించి డీఈఓ మాట్లాడారు. ఎవరెస్ట్ అధిరోహించేందుకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇచ్చి ఈనెల 15వ తేదీన ఖాట్మండుకు పంపుతున్నట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో సహిత విద్య కో ఆర్డినేటర్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రసన్నకుమార్ ఉన్నారు.
అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): జిల్లాలోని ఏడు అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గడివేముల మండలం బిలకలగూడూరు–4, డోన్ మండలం కొచ్చెరువు–2, మహానంది మండలం మహానంది–2, వెలుగోడు మండలం గుంతకందాల–1, కొత్తపల్లి మండలం జానలగూడెం, అవుకు మండలం పిక్కిళ్ల పల్లి తండా, సంజామల మండలం సి.కానాలలో అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నంద్యాలలోని ఆదర్శ నగర్, చాబోలు టెక్కె, రోజాకుంట–2, భీమవరం–1లలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన మహిళలు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు.


