ఆళ్లగడ్డ: మహా పుణ్యక్షేత్రం అహోబిలం సన్నిధిలో వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం దేవాలయం ఎదురుగా ఆకర్షణీయంగా నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవంలో భాగంగా ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు


