ఎన్‌హెచ్‌ 40లో ‘క్యూఆర్‌ కోడ్‌’ సేవలు | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ 40లో ‘క్యూఆర్‌ కోడ్‌’ సేవలు

Apr 14 2026 8:22 AM | Updated on Apr 14 2026 8:22 AM

● స్కాన్‌ చేస్తే పెట్రోల్‌ బంక్‌లు, పంక్చర్‌ షాపుల వివరాలు

● స్కాన్‌ చేస్తే పెట్రోల్‌ బంక్‌లు, పంక్చర్‌ షాపుల వివరాలు

కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, పెట్రోల్‌ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, ఇ–చార్జింగ్‌ స్టేషన్లు వంటి వసతులు ఎక్కడ ఉన్నాయి అనే ఆందోళన ప్రయాణికుల్లో సహజంగా ఉంటుంది. ఇకపై అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా మార్గం 40వ నెంబర్‌ జాతీయ రహదారిలో ప్రయాణికుల భద్రత, పారదర్శకత, సౌకర్యార్థం వినూత్నంగా క్యూఆర్‌ కోడ్‌ సేవలు అమలులోకి వచ్చాయి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి కడప వరకు విస్తరించి ఉన్న 189 కిలోమీటర్ల మేర రహదారిలో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్‌ హైవేస్‌ అథారిటీస్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం వాహనదారులకు ఇకపై ఒక డిజిటల్‌ గైడ్‌లా మారనుంది. సోమవారం (13వ తేదీ) నుంచి 40వ జాతీయ రహదారిలో డిజిటల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రాజెక్టు హెడ్‌ వి.మదనమోహన్‌ విలేకరులకు తెలిపారు.

ఒక్క స్కాన్‌తో అన్ని వివరాలు

హైవే వెంట ప్రయాణించేటప్పుడు స్మార్ట్‌ బోర్డులను స్మార్ట్‌ ఫోన్‌తో స్కాన్‌ చేయగానే మనకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ప్రధానంగా అత్యవసర సేవా కేంద్రాలు, జాతీయ రహదారి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1033, హైవే పెట్రోలింగ్‌, అంబులెన్స్‌ సేవలు, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ నెంబర్లు ఇట్టే తెలిసిపోతాయి. 189 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ వారు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ, బాధ్యతలు, కాలపరిమితి, టోల్‌ప్లాజాల మేనేజర్లు, రెసిడెంట్‌ ఇంజనీర్ల ఫోన్‌ నెంబర్లు కూడా క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెట్రోల్‌ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, పంక్చర్‌ షాపులు, ఇ–చార్జింగ్‌ స్టేషన్ల లొకేషన్ల వివరాలు కూడా ఒక్క స్కాన్‌తో తెలుసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement