ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి నీరందిస్తామని సర్కారు చెప్పడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. దీంతో వేసవి కాలం ప్రారంభంలోనే పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తింది. పలు గ్రామాల్లో ప్రజలు తమ దాహం తీర్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ గ్రామంలోని చల్లా కాలనీలో ప్రధాన తాగునీటి పైపు లైన్ వెళ్తుంది. అయిత, అక్కడ నివసించే 50 కుటుంబాలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కారు రావడంతో కుళాయి కనెక్షన్ల ఏర్పాటు అంశం అటకెక్కింది. రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు కనిపించిన అధికారులను, పాలకులను కలిసి పనులు వదులుకొని సుదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉందని, తమ ఇళ్ల ముందే పైపులైన్ వెళ్తుందని కుళాయి కనెక్షన్లు ఇచ్చి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చల్లా కాలనీవాసులు వాపోతున్నారు.
– సంజామల


