మద్దిలేటి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్‌ఎస్ రంగాపురం శివార్లో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసాన్ని పురస్కరించుకొని చిన్నారుల తలనీలాలు సమర్పించారు. వివాహాలు ఉంటడంలో స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన వారు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన చేశారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన వరపూజ నిర్వహించారు.
3న మహానంది ఆలయం మూసివేత
మహానంది: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న మహానంది ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ తలుపులు మూసివేసి రాత్రి 7 గంటలకు తెరిచి సంప్రోక్షణ పూజలు, ఆలయ శుద్ధి నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత భక్తులకు శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనం కల్పిస్తామన్నారు.
శ్రీశైలంలో నేడు కామదహనం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం కామదహనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ.. ఆదివారం స్వామి వారి ప్రధాన ఆలయం ముందుభాగంలో గల గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.30 గంటలకు కామదహన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపిస్తామని, అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహర గుండం ఎదురుగా అధిష్టింపజేసి విశేష పూజలు చేస్తామన్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకీసేవ నిర్వహించి, గంగాధరమండపం వద్దకు తెచ్చి శాస్త్రోక్తంగా పునఃపూజలు చేస్తామన్నారు. సంప్రదాయాన్ని అనుసరించి మన్మథ రూపాన్ని దహనం చేస్తామని పేర్కొన్నారు.
మహానంది ఆలయానికి రూ. 80 లక్షల విరాళం
మహానంది: మహానంది దేవస్థానంలోని శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆలయాల్లో బ్రాస్ గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు కోసం విజయవాడకు చెందిన శ్రీ వైభవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి రూ. 80 లక్షలు విరాళం ఇచ్చేందుకు అంగీకార పత్రం అందించినట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వామి, అమ్మవారి దర్శనానికి శనివారం వచ్చిన ఆమె హామీ ఇచ్చినట్లు చెప్పారు. అందులో భాగంగా పనులు ప్రారంభించేందుకు మొదటి విడతగా రూ. 30 లక్షలు చెల్లించారని చెప్పారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎరమల మధు, వేద పండితులు పాల్గొన్నారు.
మద్దిలేటి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ


