శ్రీగిరి కిటకిట
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక రద్దీ నెలకొంది. కార్తీకమాస మూడవ ఆదివారం శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాదిగా తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనానికి బారులుదీరారు. ఉచి త, శీఘ్ర, అతిశీఘ్రదర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు భ్రమరాంబా స మేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నా రు. ఉభయ సంధ్యావేళలలో గంగాధర మండపం వద్ద, ఉత్తరమాఢవీధిలో ఉసిరిచెట్ల వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించి, ప్రత్యేక నోములు నోచుకున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగించారు.
14న కోటి దీపోత్సవం..
కార్తీకమాసోత్సవాల సందర్భంగా నాల్గవ శుక్ర వారం ఈ నెల 14వ తేదీన శ్రీశైల దేవస్థానం కోటీదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తోంది. ఆలయం ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద సాయంత్రం 6 గంటల నుంచి కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందు కోసం ప్రత్యేకంగా వేదికను కూడా సిద్ధం చేశారు. కోటి దీపోత్సవంలో పాల్గొనదలచిన భక్తులు ఈ నెల 12న సాయంత్రం 5గంటలలోపు దేవస్థానం పరిపాలన భవనంలోని ప్రజాసంబంధాల విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు చెప్పా రు. కోటిదీపోత్సవంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ వారిచే శ్రీశైలక్షేత్రం–కోటిదీపోత్సవం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు.


