హైకోర్టు చీవాట్లు పెట్టినా మారని ప్రభుత్వం
● చంద్రబాబు పాలనపై ప్రజలు
తిరగబడే రోజులు దగ్గరల్లోనే..
● వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్
రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి
కర్నూలు(టౌన్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. సోమ వారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి పార్టీలు విషం చిమ్మినా ఏనా డూ ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. చంద్రబాబు పాలన ఇందిరాగాంధీ హయాంలోని ఎమర్జెన్సీ రోజులను మించిపోయిందని, ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మీడియాతో పాటు తాము కూడా ప్రభు త్వ తప్పులను ప్రశ్నించామన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా మద్యం మత్తులో ఉన్న బైకర్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారన్నారు. లక్ష్మీపురం పరిధిలోని బెల్ట్ షాపులో మద్యం సేవించినట్లు పత్రికల్లోనూ వచ్చిందన్నారు. ఇదే విష యంపై తాము మాట్లాడితే అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడి యా ప్రతినిధులు, జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎడిటర్ స్థాయి జర్నలిస్టుల ఆఫీసులకు పోలీసులు వెళ్లడం, నోటీసులు ఇవ్వడం ఎప్పు డూ చూడలేదన్నారు. సోషల్ మీడియాకు చెందిన 27 మందిపై తప్పుడు కేసులు నమోదు చేసి భయాందోళనకు గురిచేయడం దుర్మార్గమన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీహరి, కర్నూలు మేయర్ బివై.రామయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సువర్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


