అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూల చర్యలు తీసుకోవాలన్నా రు. అర్జీదారులకు ఇచ్చే ఎండార్స్‌మెంట్‌లను స్పష్టంగా, నాణ్యంగా రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు 580 రీఓపెన్ దరఖాస్తులు నమోదు కాగా, వాటిలో ఎక్కువ శాతం బండిఆత్మకూరు, పాణ్యం, నంద్యాల, కొత్తపల్లి, రుద్రవరం, డోన్, గడివేముల, బనగానపల్లె తహసీల్దార్, ఆత్మకూరు, నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో 192 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి వినతులు అందజేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


