చ..చ..చలి!
● పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. నవంబరు మొదటి పక్షంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా రాత్రి 8 గంటల నుంచే చలి ప్రభావం మొదలై తెల్లవారుజాముకు తీవ్రత పెరుగుతోంది. పొగమంచు కూడా జిల్లాను ఆవరిస్తోంది. ఈ సారి చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధిక వర్షాలు కురిశాయి. ఆగస్టు నుంచి వరుసగా అధిక వర్షాలు కురుస్తుండటంతో చెరువులు నిండుకుండలా ఉన్నాయి. వాగులు, వంకలు, కాలువలు నీటితో నిండి ఉన్నాయి. గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఈ ప్రభావంతో పగటిపూట ఎండతో పొడి వాతావరణం ఉంటున్నప్పటికీ రాత్రి చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 21 డిగ్రీల వరకు ఉంటున్నా..పలు ప్రాంతాల్లో 18 నుంచి 19 డిగ్రీల వరకు పడిపోయాయి. వెల్దుర్తి, కోసిగి, మంత్రాలయం, బండిత్మకూరు, అవుకు, వెలుగోడు తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల వరకే నమోదు అవుతున్నాయి. ఈ సారి రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలోపునకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ద్రోణి కారణంగా అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. పగలు ఎండ, రాత్రి చలి. మరోవైపు వానలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


