కమనీయం.. స్వర్ణరథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీశైల మహాక్షేత్రంలో వెలిసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు.వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఏఈవో, అర్చకస్వాములు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


