15 రోజులుగా అక్కడే!
దొర్నిపాడు: స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో గత రెండు వారాల నుంచి ఓ బైక్ అనుమానాస్పదంగా ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు పని మీద వెళ్తూ అక్కడ ఉంచి వెళ్లినా 15 రోజులు గడిచినా ఎవరూ రాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఎదైనా అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు భయపడి అక్కడ వదిలేశారా? లేక ఎవరైనా చోరీ చేసి వదిలేశారా.. అనేకోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. కొంత మంది ఆ బైక్‌లో ఏముందో ఏమోనని భయాందోళన చెందుతున్నారు.
బీటెక్ విద్యార్థి బలవన్మరణం
కర్నూలు (టౌన్): బీటెక్ విద్యార్థి కుమ్మరి భరత్ కుమార్ (20) ఉరివేసుకుని ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లూరు విఠల్ నగర్‌కు చెందిన ఈ విద్యార్థి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ఐదో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. తండ్రి కుమ్మరి శ్రీరాములు మెడికల్ ఏజెన్సీకి, తల్లి మాధవి పనిమీద ఆదివారం బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమ్మరి భరత్ బెడ్‌రూమ్‌లో ఉన్న సిలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చి తల్లి ఉరి వేసుకున్న కుమారుడిని చూసి బోరున విలపిస్తూ భర్త శ్రీరాములుకు ఫోన్ ద్వారా తెలియజేసింది. వెంటనే ఇంటికి వచ్చిన తండ్రి కుమారుడిని ఉరి నుంచి తప్పించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. తమ కుమారుడు చనిపోవడానికి ఎవరూ కారణం కాదని తల్లిదండ్రులు తెలిపారు.
15 రోజులుగా అక్కడే!


