బాబు పాలనలో భక్తులకు భద్రత ఏదీ?
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
డోన్: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పవిత్రమైన ఆలయాల వద్ద తరచుగా తొక్కిసలాటలు జరుగుతూ భక్తులు మృతి చెందుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి మృతి చెందిన తొమ్మిది మంది ఆత్మకు శాంతి చేకూరాలని ఆదివారం రాత్రి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని సమైక్యాంధ్ర కట్ట నుంచి జాతిపిత విగ్రహం వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో బుగ్గన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి, సింహచలం, కాశీబుగ్గ వంటి పవిత్ర క్షేత్రాల్లో జరిగిన ఘటనలు కూటమి ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. దైవదర్శనానికి వెళ్లిన భక్తులు క్షేద్రాల్లో జరిగిన ప్రమాదాల్లో మృత్యువాత పడుతుండటం నిత్యకృత్యమైందన్నారు. బాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్‌కుమార్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, వైఎస్సార్‌సీపీ వలంటీర్ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్ట్‌లతో వేధింపులు..
నకలీ మద్యం తయారీ కేసులో కూటమి నేతల హస్తం ఉందని ప్రభుత్వ దర్యాప్తులో వెల్లడైనా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దురుద్దేశంతో వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తోందని మాజీ మంత్రి బుగ్గన విమర్శించారు. ఆదివారం రాత్రి తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏడాదిన్నర కాలంగా వేలాది మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపడం దుర్మార్గమన్నారు. ఎలాంటి అక్రమ కేసులు బనాయించినా ఎవరూ భయపడరన్నారు. చిత్తూరు జిల్లా మొలకలచెర్వులో టీడీపీ నాయకులు చేస్తున్న నకిలీ మద్యం తయారీని ప్రభుత్వం దృష్టికి జోగి రమేశ్ తీసుకురావడమే నేరమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. జోగి రమేశ్ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
