ఆధ్యాత్మిక క్షేత్రాల్లో చిన్న నిర్లక్ష్యానికి పెద్ద మూల
శ్రీశైలంటెంపుల్: పరమేశ్వరుడు స్వయంభుగా వెలసిన శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో క్షేత్రంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. కార్తీకమాసంలో శ్రీశైల క్షేత్రానికి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్షేత్రంలో విస్త్రత ఏర్పాట్లు చేయాలని పలుమార్లు దేవస్థాన ఉన్నతాధికారి సమీక్ష సమావేశాల్లో అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. గత నెల 21వ తేదీన సైతం కార్తీక మాసోత్సవాలపై దేవస్థాన ఈఓ సమీక్షించారు. భక్తులకు వసతి, సౌకర్యవంతమైన దర్శనం, కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు, క్యూకంపార్ట్‌మెంట్లలో భక్తులకు సౌకర్యాల కల్పన, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, దశవిధహారతులు, జ్వాలాతోరణోత్సవం, పాతాళగంగలో పుణ్యనదీహారతి, కోటి దీపోత్సవం, తెప్పోత్సవం తదితర ఏర్పాట్లపై సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. అయితే పర్యవేక్షణ లేకపోవడంతో మొదటి వారంలోనే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. కార్తీకమాసం పర్వదినాల్లో క్యూలైన్లలో, ఉచిత కంపార్ట్‌మెంట్లలో ఉన్న చంటిపిల్లలకు, వృద్ధ్దులకు వేడిపాలు, భక్తులందరికీ బిస్కెట్లు, అల్పాహారం, మంచినీరు నిరంతరం అందించాలని నిర్ణయించారు. అయితే కార్తీక మొదటి సోమవారం ఉదయం 4.30 గంటల నుంచి 10.30 గంటల వరకు క్యూలైన్లలో, కంపార్ట్‌మెంట్లలో పాలు, బిస్కెట్లు పంపిణీ చేయలేదని సమాచారం. ఆ తరువాత సైతం పంపిణీ చేశారో లేదో తెలియని పరిస్థితి. అలాగే అల్పాహారం సైతం ఆలస్యంగా అందజేసినట్లు తెలుస్తోంది.
సామాన్య భక్తులకు కష్టాలు..
శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్నారే కానీ. ఆచరణలో చూపడం లేదని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. కార్తీక మొదటి సోమవారం వేకువజామున 4 గంటలకు వెళ్లిన భక్తులను కంపార్ట్‌మెంట్లలో ఉంచి సాంఘిక సంక్షేమశాఖ మంత్రి దర్శనానికి వచ్చారని, అటు తరువాత శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వచ్చారని మరికొంతసేపు భక్తులను వేచి ఉంచారు. గంటల తరబడి రేకులషెడ్డు కంపార్ట్‌మెంట్లలో భక్తులు అవస్థలు పడ్డారు. వీఐపీలకు అంటూ ఓ ప్రత్యేక స్లాట్ పెట్టిన వారు ఇష్టమొచ్చిన సమయానికి వస్తూ భక్తులను ఇబ్బందులు పెడుతున్నారని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
అన్యమత ప్రార్థనల వీడియో వైరల్..
శ్రీశైలంలో రెండు రోజుల క్రితం ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ బస్సులో అన్యమతానికి చెందిన ప్రార్థనలు చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీసి వైరల్ చేశారు. ఈ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో క్షేత్రంలో పర్యవేక్షణ కరువైందని భక్తులు విమర్శిస్తున్నారు.
విచారణకు ఆదేశం
భక్తుడి ఫిర్యాదుపై విచారణ చేయాలని మంత్రి పేషీ నుంచి రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని దేవస్థాన ఈఓకు లేఖ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆయా అంశాలకు సంబంధించి సంబంధిత విభాగాధిపతులను విచారించి నివేదిక పంపాలని శ్రీశైల ఆలయ డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు.


