కంది రైతు.. కకావికలం!
కోవెలకుంట్ల: రెండేళ్ల నుంచి కంది రైతులను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. సాగు ప్రారంభంలో వర్షాభావం, పైరు చేతికందే తరుణంలో తుపాన్లు, తెగుళ్లు కంది పంటను వెంటాడటంతో తీవ్ర నష్టాలు చవి చూశారు. వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వెచ్చించి దిగుబడులు చేతికందక కుదేలయ్యారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 37,177 హెక్టార్లలో కంది సాగు లక్ష్యం కాగా ఆయా మండలాల పరిధిలో 27,540 హెక్టార్లలో సాగు చేశారు. 180 రోజుల పంటకాలం కలిగిన కంది పంటను రైతులు జిల్లాలో విస్తారంగా సాగు కాగా ప్రస్తుతం పూత దశలో ఉంది. మొదట బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఇటీవల ఐదు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, మోంథా తుపాన్ ప్రభావంతో మూడు రోజుల పాటు కుండపోత వర్షాలు రైతులను కకావికలం చేశాయి. గతేడాది ఇదే తరహాలోనే రైతులు నష్టపోయారు. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రూ. 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే తుపాన్ల ప్రభావంతో ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. పంటచేతికందే తరుణంలో వర్షాలు కోలుకోలే ని దెబ్బతీయడంతో రైతులు కుదేలయ్యారు.
మోంథా పంజా..
జిల్లాలో ఈ ఏడాది విస్తారంగా కందిపంట సాగు కాగా భారీ వర్షాలు రైతులను వెంటాడటంతోపాటు మోంథా తుపాన్ పంజా విసిరింది. విత్తనాలు, రసాయన ఎరువులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటికే ఎకరాకు రూ.10 వేలకు పైగా వెచ్చించారు. ప్రస్తుతం పైరు పూత, పిందె దశలో ఉంది. ఇటీవల వరుస వర్షాలతో పూత, పిందె రాలిపోతుండగా మరో వైపు మోంథా తుపాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. భారీ వర్షాలతో పూత రాలిపోవడమే కాకుండా పైరును రబ్బరు పురుగు ఆశించే ఆస్కారం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐదు నెలల పాటు పైరు ఆశాజనకంగా ఉండగా ప్రస్తుత తరుణంలో భారీ వర్షాలు కంది రైతులను వెంటాడాయి. భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే కంది సాగు తీవ్ర నష్టాలు మిగిల్చుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు.
పూత దశలో వెంటాడుతున్న
భారీ వర్షాలు
పంట చేతికందే తరుణంలో తీవ్ర నష్టం
జిల్లాలో 27 వేల హెక్టార్లలో సాగు
ఆందోళనలో కంది రైతులు


