ప్రభుత్వ వైఫల్యంతోనే తొక్కిసలాట
● వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి
కల్లూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యంతోనే శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటన చోటు చేసుకుందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం జరిగిన తొక్కిసలాట మృతులకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఆదివారం పాత కల్లూరు ఊరువాకిలి వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్‌లో తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందరన్నారు. సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ చందనోత్సవం సమయంలో క్యూలైన్ పక్కన ఉన్న గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారన్నారు. తాజాగా కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. కాశీబుగ్గలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినా తగిన ఏర్పాట్లు చేయలేదని, భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టిపెట్టలేదన్నారు. పైగా ఆ ఆలయం దేవదాయ శాఖ ఆధీనంలో లేదని చెప్పడం హేయమన్నారు. ఆలయం ఎవరిదైనా ప్రజలు, భక్తుల భద్రత, బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒక పక్కన భక్తులు మృతి చెందారని వైఎస్సార్‌సీపీ ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరోపక్క చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జోగి రమేష్‌ను అరెస్ట్ చేయించారని దుయ్యబట్టారు. డిప్యూటీ మేయర్ రేణుక, పలువురు కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.


