
క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే మేలు
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించడం వల్ల కోలుకునే అవకాశం ఉంటుందని రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మహేశ్వరప్రసాద్ చెప్పారు. శుక్రవారం స్థానిక ముజఫర్‌నగర్ యుపీహెచ్‌సీలో స్వస్త్‌నారీ స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలు, అపరిశుభ్రత,అబార్షన్ తదితర కారణాలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ప్రాథమిక దశలో దీనిని గుర్తించి చికిత్స తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా వీటిని నివారించుకోవచ్చన్నారు. ప్రాథమిక దశలో మొహమాటం కారణంగా వైద్యపరీక్షలకు ఆసక్తి చూపకపోతే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీ ఎంఎఓ డాక్టర్ ఉమా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, డీపీఓ విజయరాజు, కన్సల్టెంట్ సుధాకర్, మల్లికార్జున, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
డోన్ టౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శుక్రవారం డోన్ డిపోను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ను పరిశీలిస్తూ పలువురు ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్టాండ్‌లో తాగునీటి వసతి, మూత్రశాలలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిపో పరిసరాలు, గ్యారేజ్‌ను తనిఖీ చేశారు. బస్సుల సంఖ్య, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని, త్వరలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం, సంస్థ నిర్వాహణ ఖర్చులను తగ్గించి సంస్థ లాభాలు ఆర్జీంచేలా 110 ఎలక్ట్రికల్ బస్సులను త్వరలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట నంద్యాల జిల్లా రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా, డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్ తదితరులు ఉన్నారు.