
శుభంకరీ..కాళరాత్రి
● శ్రీగిరి క్షేత్రంలో నేత్రానందపర్వంగా సాగుతున్న దసరా ఉత్సవాలు
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానందభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో కాళరాత్రి అమ్మవారిని ఉంచి అర్చకులు, వేదపండితులు విశేష పూజాకార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గజ వాహనంపై అలంకరించారు. గజ వాహనదీశులైన పార్వతీ పరమేశ్వరులను అలంకార మండపంలో ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. కాళరాత్రి అమ్మవారిని, గజ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆల య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు నిర్వహించిన గ్రామోత్సవం కమనీయంగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, డోలు విన్యాసాలు, కేరళ చండీమేళం, డప్పు వాయిద్యాల నడుమ కళాకారుల నృత్యప్రదర్శనలు గ్రామోత్సవానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ పూజా కార్యక్రమం నేత్రానందభరితంగా సాగింది. ప్రత్యేక అలంకీకృతులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు నందివాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబరు 1వ తేదీ శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయాణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.

శుభంకరీ..కాళరాత్రి

శుభంకరీ..కాళరాత్రి