
అరాచకాలకు మూల్యం చెల్లించాల్సిందే
● అధికారపార్టీ నాయకులకు
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక
● కార్యకర్తలకు అండగా నిలబడేందుకే
‘డిజిటల్ బుక్’
ఆళ్లగడ్డ: ‘అధికారం ఉంది కదా అని అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రతి ఒక్కరు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాల’ని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హెచ్చరించారు. ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్ బుక్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్ కోడ్ ఐవీఆఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇందుకోసమే జగన్ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. దీన్ని అన్ని మండలాలు, గ్రామాల్లో రిలీజ్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఇప్పటికే పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. డిజిటల్ బుక్‌ను టీడీపీ నేతల రెడ్‌బుక్ మాదిరి పెట్టుకున్నామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పార్టీ సానుభూతి పరులతో పాటు సామన్యుల సైతం ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటల్ బుక్ పెట్టామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఇప్పటికే కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈవిషయం తెలిసి అసెంబ్లీలో కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు కంగారు పడుతున్నారన్నారు. కూటమి సర్కారు దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్‌రెడ్డి, సింగం వెంకటేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సురేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.