
సబ్‌జైల్ తనిఖీ చేసిన జడ్జి
నంద్యాల (వ్యవసాయం): నంద్యాల సబ్ జైల్‌ను సోమవారం మూడవ అదనపు జిల్లా జడ్జి, లోక్‌అదాలత్ చైర్మన్ అమ్మన్నరాజా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జైలు గదులు, పరిసరాలు, వంటశాలను పరిశీలించారు. అనంతరం ఖైదీల వివరాలు, వారి ఆరోగ్య విషయాల గురించి ఆరా తీశారు. ఆర్థికంగా వెనుకబడిన ఖైదీలకు, 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తామన్నారు. ఖైదీలతో ఒక్కొ క్కరితో మాట్లాడి వారి నేర విషయాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన రిమాండు ఖైదీలతో మాట్లాడుతూ.. జైలు శిక్ష అనంతరం సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. సూపరింటెండెంట్ గురుప్రసాద్ రెడ్డి లోకాదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఉభ య తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీ గా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు అన్‌లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు.
● ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
నంద్యాల: ‘మా ఇంటికి రస్తా ఇవ్వకుండా పక్కన నివాసముంటున్న వారు ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా రస్తా స్థలం మాదేనని తీర్పు ఇచ్చింది. అయినా ఇబ్బంది పెడుతున్నారు. విచారించి న్యాయం చేయండి’ అంటూ చాగలమర్రి మండలం మద్దూరు గ్రామానికి చెందిన చిన్న పుల్లయ్య జిల్లా ఎస్పీ సునీల్‌షెరాన్‌కు వినతి పత్రం అందజేశారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్ట పరిధిలో ఉన్న ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ఆయా సమస్యలపై 76 వినతులు వచ్చాయని, వాటిని ఆయా స్టేషన్ల వారీగా ఎండార్స్ చేశామని ఎస్పీ తెలిపారు.
శనగ విత్తనాలకు అడ్డగోలు ధర
● కిలో ధర రూ.78.. సబ్సిడీ 25 శాతమే
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్‌లో కిలో శనగల ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం రబీ సీజన్ కోసం సబ్సిడీపై పంపిణీ చేసే పప్పు శనగలకు మార్కెట్ ధర కంటే తక్కువ ఉండాలి. అప్పుడే రైతులు సబ్సిడీ విత్తనాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రం 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. కిలోకు 25 శాతం సబ్సిడీ (రూ.19.50) ఉంటుంది. సబ్సిడీ పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తుండటంతో సబ్సిడీ విత్తనాలకు డిమాండ్ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు 33 నుంచి 40 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పంపిణీ చేసింది. అక్టోబర్ 3 నుంచి శనగ విత్తనాలు పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

సబ్‌జైల్ తనిఖీ చేసిన జడ్జి

సబ్‌జైల్ తనిఖీ చేసిన జడ్జి