
కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసింది!
ఓర్వకల్లు: కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసిందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. హుసేనాపురం గ్రామంలో రైతులు సాగు చేసిన పత్తి, పొగాకు పంటలను సోమవారం ఆయన రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా చేదు శ్రీనివాసులు, గాలెన్న అను రైతులు సాగు చేసిన పత్తి పొలాల్లో నిల్వవున్న వర్షపునీటితో పంట దెబ్బతిన్న పరిస్థితులను గమనించారు. అనంతరం నడివాగు వద్ద నిర్మించిన చెక్‌డ్యామ్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎద్దులబండిపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతుల సమక్షంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సాగుచేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయన్నారు. పంటలు కోతదశకు వచ్చే సమయంలో అధిక వర్షాలు కురవడం, పండించిన దిగుబడులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి దిగుబడులను అమ్మకోవడానికి మార్కెట్‌కు తీసుకెళ్లిన రైతుల నుంచి కమీషన్ల ముసుగులో దోచుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన బాధ్యత మార్కెట్ శాఖ అధికారులపై ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి ధరలు తగ్గినప్పుడు రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం, ధరలు పెరిగినప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడకుండా సబ్సిడీతో ఉల్లిని అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించపోగా, హెక్టారుకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని చెప్పినా ఇంత వరకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదన్నారు.
అధిక వర్షాలతో నష్టపోయిన
అన్నదాతలను ఆదుకోవాలి
కర్నూలు మార్కెట్‌లో
కమీషన్ల దందాను అరికట్టాలి
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి

కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసింది!