
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్య త అధికారులదేనన్నారు. జిల్లాలో గత ఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు మొత్తం 43,143 అర్జీలు స్వీకరించబడ్డాయని, అందులో సరైన రీతిలో ఎండార్స్ చేయకపోవడం వల్ల 471 దరఖాస్తులు రీ–ఓపెన్ అయ్యాయని తెలిపారు. ప్రతి అధికారి రీ–ఓపెన్ అయిన దరఖాస్తులపై పూర్తి దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులు 1,926 ఉన్నాయని, అందులో రెవెన్యూ 1,038, సర్వే 394, పోలీస్ 130 తదితర శాఖల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఆడిట్‌లో లోపాలు గుర్తించిన ఫిర్యాదులను తప్పనిసరిగా రీ–ఓపెన్ చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్‌బ్యాక్ సేకరణలో డోన్ రూరల్, గడివేముల, గోస్పాడు, జూపాడుబంగ్లా, మిడుతూరు, సంజామల, రుద్రవరం, పాములపాడు, వెలుగోడు తదితర 15 మండలాలు గత రెండు వారాలుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సోమ వారం మొత్తం 263 మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.