
బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం
నంద్యాల(న్యూటౌన్): చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్‌స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్‌పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్‌స్పైర్ మనక్ ప్రోగ్రామ్‌లో పాల్గొనవచ్చు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–08 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జమ చేశారు. అయితే అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ ప్రాజెక్టుల రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల ప్రాజెక్టుల ఎంపిక సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణమని చెబుతున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 156 ప్రాథమికోన్నత, 277 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో 167 ప్రాథమికోన్నత, 190 ఉన్నత పాఠశాలలున్నాయి.
గతేడాది ఇలా..
జిల్లాలో గతేడాది జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్ పోటీల్లో 162 ప్రదర్శనలు ఎంపిక కాగా రాష్ట్రస్థాయికి 16 ఎంపిక చేశారు. వీటిలో పలు వినూత్న ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చాగల్రమరి జెడ్పీహెచ్‌ఎస్ ముల్లా మోమిన్ తయారు చేసిన ఉమెన్ సేఫ్టి బ్యాగ్, వేంపెంట జెడ్పీహైస్కూల్ విద్యార్థి సంతోష్ రాజ్ రూపొందించిన సోలార్ అగ్రికల్చరల్ ఫెర్టిసైడ్ స్పేయర్ విత్ లోకాస్ట్ పరికరం, బనగానపల్లె జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి హర్షియభాను ఆవిష్కరించిన ఆటోమేటిక్ మినీ ఫ్యాన్ తదితర ఆవిష్కరణలు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ ఏడాది మరింత మెరుగైన ఆవిష్కరణలను రూపొందించి జాతీయ స్థాయి లో ప్రదర్శించేలా పలు పాఠశాలల ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు.
ప్రాజెక్టులను పంపండిలా..
www.inspireawards&dst.gov.in వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీలోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం అందజేస్తోంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి.
జాతీయ స్థాయిలో నిలిచేలా
రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. –కేవీ సుబ్బారెడ్డి,
జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్, నంద్యాల
సృజనాత్మకత ఆవిష్కరణలకు ఆహ్వానం
సెప్టెంబర్ 15 వరకు గడువు
ఇన్‌స్పైర్ మనక్‌కు పాఠశాలల్లో
రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టులు

బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం