ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు

Oct 15 2026 11:29 AM | Updated on Oct 15 2026 11:29 AM

మార్కెట్‌కు రాకుండానే..

286

కేంద్రాల్లో

ఫ రెండు రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు

ఫ 4.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా

ఫ రైతుల నుంచి ముందుగానే కొంటున్న మిల్లర్లు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 286 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి సుమారు 4.32 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎల్‌నినో కారణంగా పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో అందులో సగమే కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రభుత్వం కంటే ముందే..

జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకముందే కొందరు మిల్లర్లు రంగంలోకి దిగారు. రైతులు కల్లాలు, పొలాల వద్ద ఆరబోసిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సన్న రకం ధాన్యానికి మార్కెట్‌లో మంచి ధర లభిస్తుండటంతో రైతులు మిల్లర్లకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్ని చోట్ల మిల్లర్లు క్వింటాల్‌కు రూ.4,500 వరకు చెల్లించి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. నల్లగొండ మండలంలోని కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో ఓ రైతు తీసుకువచ్చిన సన్న ధాన్యానికి ఈ ధర పెట్టినట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వ మద్దతు ధరతో పోలిస్తే అదనపు ధర లభిస్తుండటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సన్నాలకు రికార్డు స్థాయి ధర

సన్న ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడంతో మిల్లర్లు పోటీపడి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్‌కు రూ.4,500 వరకు ధర పలుకుతుండటంతో రైతులకు కొంత ఊరట లభిస్తోంది. మరోవైపు మిల్లర్లు మిల్లుల వద్దకు ఎక్కువ శాతం వచ్చే సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.4,050లు పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. అయితే ఈ ధర అన్ని రకాల ధాన్యానికీ, అన్ని ప్రాంతాల్లోనూ వర్తిస్తుందని చెప్పలేని పరిస్థితి ఉంది. ధాన్యం నాణ్యత, రకం, తేమ శాతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉంటున్నాయి.

కొనుగోలు కేంద్రాలపై రైతుల ఆశలు

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తే ధాన్యం విక్రయాలు సులభమవుతాయని రైతులు భావిస్తున్నారు. అంతేకాకుండా మిల్లర్లు సిండికేట్‌గా మారి ధర తగ్గించే అవకాశం లేకుండా పో తుందని, త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కేంద్రాల్లో తూకం, రవాణా వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో ఈ వర్షాకాలంలో వరిసాగు తగ్గింది. చాలావరకు పొలాలు ఎండిపోగా మిగిలిన సన్నధాన్యాన్ని కూడా మార్కెట్‌కు రాకుండానే మిల్లర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే సీజన్‌ కూడా క్రాఫ్‌ హాలిడే ప్రకటించే అవకాశం ఉన్నందున వరి ధాన్యం వచ్చే అవకాశం లేదు కాబట్టి మిల్లర్లు పెద్ద ఎత్తున సన్న ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ముందే మేల్కొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకుండానే ముందస్తుగా కొనుగోలు ప్రారంభించడంతోపాటు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement