తూము గేట్లు ఎత్తివేత
నిడమనూరు : నాగార్జునసాగర్ ఎడమకాల్వపై 31.1 కిలోమీటర్ వద్ద నర్సింహాలగూడెం మేజర్ స్లూయిస్లో ఏర్పడిన లీకేజీ నుంచి నీటి ప్రవాహం ఆగడం లేదు. విశాఖపట్నం, విజయవాడ నుంచి డైవర్లు (గజ ఈతగాళ్లు) వచ్చి నీటిలో పడిన లీకేజీ, లేదా బుంగను గుర్తిస్తే దాని ఆధారంగా అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే డైవర్లు రాకపోవడంతో అధికారుల పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. స్లూయిస్లో లీకేజీపై 24 గంటలపాటు అధికారులు పర్యవేక్షణ ఉంటుందని ఎన్నెస్పీ డీఈ స్వామి తెలిపారు. మంగళవారం ఉదయం కూడా ఎన్నెస్పీ ఉద్యోగులు, లస్కర్లు తూములో గడ్డి వేసి నీటి ప్రవాహం తగ్గించే ప్రయత్నం చేసినట్లు డీఈ తెలిపారు. మంగళవారం సాయంత్రం కంటే బుధవారం నీటి లీకేజీ తగ్గినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి మేజర్ మూసివేసి వేసవిలో మరమ్మతులు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మేజర్ను మూసేస్తే తాగునీటి ఎద్దడే..
సాగర్ ఎడమకాల్వపై నర్సింహాలగూడెం వద్ద మేజర్ స్లూయిస్ మూసివేస్తే రానున్న రోజుల్లో నిడమనూరు చెరువు ఎండిపోయి, భూగర్భ జలాలు తగ్గి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ చెరువు కింద నిడమనూరు, శాఖాపురం రైతులు 300 ఎకరాల వరకు వరిసాగు చేస్తుంటారు.
ఎడమకాల్వపై మేజర్ల ద్వారా నీటి విడుదలకు లస్కర్లు గేట్లు ఎత్తుతున్నారు. బుధవారం ముదిమాణిక్యం మేజర్ గేట్లను ఎత్తారు. అయితే ఎక్కడ కూడా యాంత్రికంగా గేట్ల అమరిక లేకపోవడం.. ఆయిల్ గ్రీసింగ్ చేయకపోవడంతో గేట్ల ఎత్తడం కష్టతరంగా మారింది. మేజర్లకు ఆర్నెళ్లకు ఒకసారైన గ్రీసింగ్, స్వల్ప మరమ్మతులు చేపడితే గేట్ల ఎత్తివేత సులభంగా ఉంటుందని పలువురు ఉద్యోగులు అంటున్నారు.
ఫ ఎడమకాల్వపై నర్సింహాలగూడెం వద్ద మేజర్ స్లూయిస్లో లీకేజీ
ఫ డైవర్లు వచ్చి చూస్తేనే మరమ్మతులకు అవకాశం


