నల్లగొండ టౌన్: ఎన్హెచ్ఎం(నేషనల్ హెల్త్ మిషన్) ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం, జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె శిబిరానికి వారు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి ఉద్యోగికి కేడర్ ఫిక్సేషన్ అమలు చేసి 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, మహిళా సిబ్బందికి కేడర్తో సంబంధం లేకుండా 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్–జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, వైద్యులు హరిప్రియ, దయానంద్, గణేశ్, ఉపేందర్, తరాల సురేష్, ఎండీ ఖలీమ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు బీజేపీ మద్దతు
కలెక్టరేట్ ఎదుట నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో బుధవారం బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి పాల్గొని మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీజేపీ అండగా నిలిచి పోరాడుతుందన్నారు.


