డిండి : కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐ) ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తీసుకురాకపోతే ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన డిండి మండంలోని కామేపల్లి శివారులో ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు. అనంతరం డిండిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులో ఉన్న నీరు చివరి దశ వరకు సరిపోతుందా లేదా అనే కనీస అంచనా లేకుండానే నీటిని విడుదల చేశారని విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరిందని, పంట చేతికి రావడానికి ఇంకా 45 రోజుల సమయం పడుతుండటంతో రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి డిండికి నీటిని తీసుకొచ్చి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకుంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో డిండిలో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌వీఆర్, విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీనివాసరావు, గిరమోని శ్రీను, వెంకటయ్య, మల్లయ్య, చంద్రయ్య, రాములు, శ్రీను, కొండల్‌రావు, మాదవయ్య, రేణయ్య పాల్గొన్నారు.


