నల్లగొండ : తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములు పెండ్లిపాకల ప్రాజెక్టులో ముంపునకు గురయ్యాయని, పరిహారం అందకుండా మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆరుగురు గిరిజన యువకులు కలెక్టరేట్ వద్ద సెల్ టవర్ ఎక్కారు. శుక్రవారం నల్లగొండ కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పి టవర్ నుంచి కిందకు దించారు. కొండమల్లేపల్లి మండలం గాజానగర్ పరిధిలోని 109 ఎకరాల భూమిని తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్నామని గిరిజన కుటుంబాలు చెప్పాయి. ఆ భూమి రికార్డుల్లో అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి పేరు ఉండటంతో, కబ్జాలో గిరిజనలు ఉండడంతో భూమి అతని పేరుపై ఉండడంతో వారు ఒక ఒప్పందానికి వచ్చారు. అబ్దుల్ రెహమాన్ 50 ఎకరాలు తీసుకుని, మిగతా భూమి గిరిజనులకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అయితే, ఈ వ్యవహారంలో తమ పక్షాన పెద్దమనిషిగా ఉన్న నేనావత్ జీవన్ అనే ప్రభుత్వ ఉద్యోగి తమను మోసం చేశాడని, ప్రాజెక్టులో పోయిన భూమికి వచ్చే పరిహారాన్ని పంచుకుందామని చెప్పి, జీవన్ తన కుటుంబ సభ్యుల పేరు మీదనే 40 ఎకరాల భూమి ఉన్నట్లుగా తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించి, పరిహారం మొత్తం కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వారు వాపోయారు.
కలెక్టరేట్‌లో టవర్ ఎక్కిన గిరిజనులు
పెండ్లిపాకల ప్రాజెక్టులో భూములు కోల్పోయామని ఆవేదన


