స్టాక్ యార్డ్ లేకుండానే తవ్వకాలు
నిబంధనల ప్రకారమే రీచ్‌ల నిర్వహణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో పారదర్శకతకు పాతరేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి అర్హులైన వారికి ఇసుక రీచ్‌లు కేటాయించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా జిల్లాలోని వంగమర్తి ఇసుక రీచ్ కేటాయింపు వ్యవహారం ఉంది. 2021 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు రాష్ట్రస్థాయిలో కేటాయింపులు పొడిగిస్తూ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇటుకలపహడ్‌లో రీచ్ కేటాయింపు ఒకచోట ఉంటే.. తవ్వకాలు మరోచోట జరపడం అనుమానాలకు తావిస్తోంది.
ఏళ్ల తరబడి అదే కాంట్రాక్టర్?
సాధారణంగా ఇసుక రీచ్‌ల కేటాయింపులో ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు, టెండర్లు కీలకం. పోటీ ద్వారా కేటాయింపులు చేపట్టడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు అక్రమాలకు అవకాశం తగ్గుతుంది. అయితే వంగమర్తి ఇసుక రీచ్ విషయంలో 2021 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు కేటాయింపులు పొడిగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి విడతలో నిబంధనల ప్రకారం పొడిగింపులు చేశారా? టెండర్ల ప్రక్రియను ఎందుకు చేపట్టలేదు? ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలపై స్పష్టత లేకుండాపోయింది.
రీచ్ ఒకచోట.. తవ్వకాలు మరోచోట!
ఇటుకులపహాడ్ ఇసుక రీచ్ వ్యవహారం సైతం అనుమానాలకు తావిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. రీచ్ కేటాయింపు ఒకచోట ఉండగా.. తవ్వకాలు మరోచోట చేపడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేటాయించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఎవరు ఇచ్చారన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ, మైనింగ్, సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించకుండానే మరోచోట తవ్వకాలకు అనధికారికంగా ఓకే చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పరిధి దాటి తవ్వకాలు జరిగితే పర్యావరణానికి నష్టం వాటిల్లడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారులు స్పందించేనా?
ఇసుక రీచ్‌ల కేటాయింపులు, తవ్వకాలు, రవాణా, విక్రయాలపై పారదర్శకత ఉండేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉంది. వంగమర్తి రీచ్ కేటాయింపు నుంచి ఇప్పటివరకు జరిగిన పొడిగింపులు, టెండర్ల నిర్వహణ, అనుమతుల వివరాలు, స్టాక్ యార్డ్ నిర్వహణ, ఇసుక తరలింపు లెక్కలపై ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న చర్చ సాగుతోంది. ఇటుకలపహడ్ రీచ్ పరిధిలో తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయి? వాటికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపైనా స్పష్టత లేకుండాపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయాలను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. స్టాక్ యార్డ్ నిర్వహణ, నిల్వ లెక్కలు, విక్రయాల వివరాలు, రవాణా అనుమతులపై పర్యవేక్షణ అవసరం. అయితే వంగమర్తి రీచ్ పరిధిలో స్టాక్ యార్డ్ నిర్వహించకుండానే ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టాక్ యార్డ్ నిర్వహణ ఉందా? ఎంత మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది? అనుమతించిన పరిమాణంలోనే తవ్వకాలు జరిగాయా? రవాణా, విక్రయాల లెక్కలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేశారా? అన్న అంశాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
మూసీ ప్రాజెక్టు పరిధిలో ఇసుకరీచ్‌లు నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయి. ఇటుకులపహాడ్ పరిధిలో 10 లక్షల క్యూబిక్‌మీటర్ల ఇసుక తవ్వకాలకు ఏడాది గడువుతో నాలుగేళ్ల కిందట టెండర్ కాగా నేటికి 1.70 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకనే తవ్వారు. ఇటుకులపహాడ్ రీచ్ వద్ద ఇసుక లభ్యత లేకపోవడంతో దానిని వంగమర్తి రీచ్‌కు బదిలీ చేశాం. 10 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు పూర్తయ్యేవరకు రీచ్ కొనసాగుతుంది. నిబంధనల ఉల్లంఘన లేకుండా చూస్తున్నాం.
– మదన్‌మోహన్,
టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారి
ఫ వంగమర్తి ఇసుక రీచ్ కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన
ఫ 2021 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు పొడిగింపు
ఫ టెండర్లు పిలవకుండానే రాష్ట్రస్థాయిలో అప్పగింత
ఫ స్టాక్ యార్డ్ నిర్వహణ లేకుండానే తవ్వకాలు
ఫ ఇటుకులపహాడ్‌లో రీచ్ కేటాయింపు ఒకచోట, తవ్వకాలు మరోచోట


