కష్టమొచ్చింది | - | Sakshi
Sakshi News home page

కష్టమొచ్చింది

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

బతుకమ్మకు
చెట్లు పూయలేదు.. చెరువులు నిండలేదు

పెద్దవూర : తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని తెచ్చిపెట్టే పూల పండుగ బతుకమ్మపై ఈ సారి కరువు ప్రభావం పడింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా తంగేడు, గునుగు, అడవి చేమంతి, పట్టుకుచ్చులు, గుమ్మడి, ముత్యాల, బంతిపూలతో అందంగా బతుకమ్మలు పేర్చి పూల పండుగ జరుపుకుంటారు. ఈ సారి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా కురవడంతో గునుగు, ఇతర పూలు మొగ్గ దశలోనే ఉన్నాయి. ఇక తంగేడు చెట్లకు పూలే కనిపించడం లేదు. దీంతో బతుకమ్మ పేర్చడానికి గునుగు, తంగేడు పూలు కరువయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు మహిళలు టేకు పూలు తెంపి కట్టలు కట్టి రంగులద్ది బతుకమ్మకు సిద్ధమవుతున్నారు. మరి కొందరు మార్కెట్‌లో దొరికే బంతి, చేమంతి పూలను కొనుగోలు చేస్తున్నారు.

కరువు పరిస్థితులే కారణం

కొండ కోనల్లో, బీడు భూముల్లో విరివిగా దొరికే తంగేడు, కొండ చామంతి పూల చెట్లు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయాయి. మెట్టపంటలైన జొన్న, మొక్కజొన్న, పెసర పత్తి చేలలో విరివిగా దొరికే గునుగు, ముత్యాల పూలు కూడా ఈ యేడాది లభించడం లేదు. రైతులు మెట్టపంటల సాగుపై దృష్టిసారించకుండా పోవడంతో పూలకు కరువు వచ్చినట్టయ్యింది. అంతే కాకుండా ఈ యేడాది వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. గతనెలలో నవరాత్రులు ముగించుకున్న వినాయక విగ్రహాలను కూడా భక్తులు తప్పని పరిస్థితుల్లో నీళ్లులేని చెరువుల్లో వదిలేసి వెళ్లడం కరువుకు అద్దం పడుతోంది. ఒకవేళ తాము బతుకమ్మ ఆడినా చెరువులు, కంటల్లో నీళ్లు లేని కారణంగా వాటిని ఎక్కడ నిమజ్జనం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందని మహిళలు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement