నల్లగొండ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని పంచాలని కోరుతూ ప్రజలకు మంత్రి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
అధికారుల కృషి వల్లే
అవార్డు : కలెక్టర్
నల్లగొండ : సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు, సహాయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ల కృషి వల్లే జిల్లాకు అవార్డు వచ్చిందని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేతులమీదుగా కలెక్టర్ చంద్రశేఖర్ అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడారు. సమాచార హక్కు చట్టం కింద కేసులను పరిష్కరించడంలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు.
నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా హేమలత
నల్లగొండ : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని శుక్రవారం ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా బైరెడ్డి హేమలత వెంకట్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా వడ్డేపల్లి శ్రీరాములు, సభ్యులుగా తిరుమల రాము, కత్తుల కృష్ణయ్య, పిన్నపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మర్రి నరసింహ, వడ్డె దామోదర్‌రెడ్డి, షేక్ సయ్యద్, గౌని నరేష్, నల్లగొండ రాణి లింగస్వామి, పల్లెబోయిన లింగయ్య, దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, చిట్టిపోలు నాగయ్య, గుండె రమేష్‌బాబు నియమితులయ్యారు. ఈ కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు పదవిలో ఉంటుంది.


