తేలిన ‘ఆర్టీసీ’ ఫలితం | - | Sakshi
Sakshi News home page

తేలిన ‘ఆర్టీసీ’ ఫలితం

Oct 10 2026 1:46 AM | Updated on Oct 10 2026 1:46 AM

రామగిరి(నల్లగొండ) : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రధానంగా రెండు బలమైన కూటముల మధ్య హోరాహోరీగా సాగాయి. ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ఒక కూటమిగా, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ మరో కూటమిగా పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వెలువడిన ఫలితాల్లో రాష్ట్ర గుర్తింపునకు సంబంధించి తెలంగాణ ఎంప్లాయిస్‌ యూనియన్‌కు 1,017 ఓట్లు, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు 918 ఓట్లు దక్కాయి. రీజియన్‌ స్థాయి గుర్తింపునకు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కు 977 ఓట్లు, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు 966 ఓట్లు వచ్చాయి.

98.97 శాతం పోలింగ్‌

సుదీర్ఘ విరామం తర్వాత నిర్వహించిన ఈ ఎన్నికలపై ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిలో తీవ్ర ఆసక్తి నెలకొంది. రీజియన్‌ పరిధిలోని ప్రధాన డిపోల్లో ఉదయం నుంచే ఉద్యోగులు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి డిపోల వారీగా శరవేగంగా సాగిన ఓటింగ్‌.. సాయంత్రం 6 గంటల సమయానికి ముగిసేసరికి రీజియన్‌ వ్యాప్తంగా ఏకంగా 98.97 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఆర్టీసీ ఉద్యోగులు తమ ఓటు హక్కును ఎంతో ఉత్సాహంగా వినియోగించుకున్నారు. నల్లగొండ, నార్కట్‌పల్లిలతో పాటు నల్లగొండ ఆర్‌ఎం ఆఫీస్‌లో 100 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. రీజియన్‌ పరిధిలోని మొత్తం 2,036 ఓట్లకు గాను 2,015 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటితో పాటు మిర్యాలగూడలో 1, దేవరకొండలో 4 చొప్పున మొత్తం 5 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి.

రీజియన్‌ స్థాయిలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌, రాష్ట్రస్థాయిలో ఈయూకి మెజార్టీ

గట్టి పోటీతో ఉత్కంఠ వాతావరణం..

రీజియన్‌ స్థాయిలో పోటీ అత్యంత సమీపంలో సాగింది. స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కేవలం 11 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నిలవగా.. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 99 ఓట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. రెండు ప్రధాన కూటములకు కార్మికుల నుంచి సమాన స్థాయిలో మద్దతు లభించడంతో ఫలితాల సరళి ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement