ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నకిరేకల్ : ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని మొండివారి కాలనీలో నివాసముంటున్న నాగిళ్ల నాగరాజు(30)కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా ఈ నెల 22న నాగరాజు ఇంట్లో పురుగుల మందు తాగాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి నాగరాజును నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. నాగరాజు సోదరుడి కూమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరిబాబు తెలిపారు.
మాంజా తగిలి నెమలి మృతి
మర్రిగూడ : మండలంలోని బట్లపల్లి గ్రామంలో చైనా మాంజా కాళ్లకు చుట్టుకొని నెమలి మృతిచెందింది. మంగళవారం మండల పశువైద్యాధికారి సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం బట్లపల్లి గ్రామ శివారులోని ఓ రైతు పొలం వద్దకు ఆహారం కోసం వచ్చిన నెమలి కాళ్లకు మాంజా చుట్టుకొని ప్రాణాలు కోల్పోయింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అఖిలేష్ ఘటనా స్థలానికి చేరుకొని నెమలిని పరిశీలించారు. నెమలికి పోస్టుమార్టం చేసి ఖననం చేసినట్లు పశువైద్యాధికారి తెలిపారు.
సెల్‌ఫోన్ చార్జర్ వైరు
విషయమై ఘర్షణ
● అడ్డుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కత్తిపోటు
కొండమల్లేపల్లి : సెల్‌ఫోన్ చార్జర్ వైరు విషయమై జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి కత్తిపోటుకు గురయ్యాడు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని అమరావతి వైన్స్ వద్దకు సోమవారం రాత్రి బోడ అశోక్, అనిమళ్ల అనిల్ మద్యం తాగేందుకు వచ్చారు. గతంలో వచ్చినప్పుడు తన వద్ద తీసుకున్న సెల్‌ఫోన్ చార్జర్ వైరును తిరిగి ఇవ్వమని వైన్స్‌లో పనిచేస్తున్న మల్లికంటి అనిల్ వారిని అడిగాడు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో బోడ అశోక్, అనిమళ్ల అనిల్ సోడా సీసాలతో మల్లికంటి అనిల్‌పై దాడి చేశారు. దీంతో మల్లికంటి అనిల్ కోపోద్రిక్తుడై కత్తితో తిరిగి ఎదురుదాడి చేశాడు. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు వెళ్లిన పగిళ్ల సన్నీ మెడకు కత్తి తగిలి గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సన్నీ మెడకు 14 కుట్లు పడినట్లు సమాచారం. ఈ ఘర్షణకు సంబంధించి 9 మందిపై రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.


