ముంచుకొస్తున్న పరీక్షలు.. పూర్తికాని పాఠాలు!
డిసెంబర్‌లో సిలబస్ పూర్తవుతుంది
తిప్పర్తి, కనగల్ మండలాల్లోని జూనియర్ కళాశాలల్లో డిప్యూటేషన్ మీద అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక కాలేజీలో మూడు రోజులు, మరో కాలేజీలో మూడు రోజులు పాఠాలు చెబుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉంది. విద్యా సంస్థల ప్రారంభ దశలోనే పరీక్షల నిర్వహణ తేదీలను నిర్ణయిస్తే దానికి తగ్గట్లుగా సిలబస్ పూర్తి చేసేందుకు అధ్యాపకులు ప్రణాళిక ప్రకారం ముందుకు పోతారు. కానీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పరీక్షల నిర్వహణ ముంచుకు వస్తుండడంతో అధ్యాపకులతో పాటు విద్యార్థులకు సైతం ఒత్తిడి పెరుగుతుంది.
నల్లగొండ టూటౌన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరిలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఓ వారం ముందుకు జరపడంతో విద్యార్థులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 140 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉండగా, వాటిలో 12వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు కొన్ని కాలేజీల్లో 50 శాతం సిలబస్ పూర్తి కాగా, మరికొన్ని చోట్ల 60 శాతమే పూర్తయినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. కాలేజీలు జూన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ ఐదు నెలల్లో సిలబస్ 60 శాతమే పూర్తి కావడంతో మిగతా 40 శాతం పూర్తి కావడానికి మరో నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఇంటర్ సిలబస్ పూర్తయ్యేది ఎలా అనే చర్చ జరుగుతోంది.
రెండు నెలల్లో సిలబస్ పూర్తి అసాధ్యం...
ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల ప్రకారం చూసుకుంటే నవంబర్ నెలాఖరులోగా సిలబస్ మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. జవనరిలో ప్రాక్టికల్స్ ఉన్నందున డిసెంబర్‌లో విద్యార్థుల చేత ప్రాక్టికల్స్ చేయించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో అయితే ప్రాక్టికల్స్ ముందుగానే చేయిస్తున్నా.. నిర్వహణ సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాబోధన మాత్రమే ముందుగా చేస్తారు. ఆయా కాలేజీల్లో ఇప్పటి వరకు విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించలేని తెలుస్తోంది. గురుకుల కాలేజీల్లో ప్రాక్టికల్ చేయడానికి సామగ్రి లేకపోవడంతో విద్యార్థులను ప్రభుత్వ కాలేజీలకు తీసుకెళ్లి చేయించాల్సి ఉంది. కానీ ఇంకా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. పరీక్షలకు ముందు ప్రాక్టికల్స్ మమ అనిపించే అవకాశం ఉందనే చర్చ లేకపోలేదు. 100 మందికిపైగా విద్యార్థులు ఉంటే వారి కాలేజీల్లోనే సెంటర్ పడే అవకాశం ఉండడంతో ఇది వారికి బాగా కలిసి రానుంది.
ఫ ఇంటర్మీడియట్ సిలబస్ 60 శాతమే పూర్తి
ఫ వచ్చేఏడాది ఫిబ్రవరి 25 నుంచి
పరీక్షలు.. జనవరిలో ప్రాక్టికల్స్
ఫ డిసెంబర్‌లో మిగతా సిలబస్ పూర్తికావడం కష్టమే..
ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరిలో ఉన్నందున అన్ని కాలేజీల్లో డిసెంబర్‌లోగా సిలబస్ పూర్తి అవుతుంది. ప్రతి కాలేజీలో తప్పనిసరిగా సిలబస్ డిసెంబర్‌లోగా పూర్తి చేయాల్సిందే. ఇప్పటికే 90 శాతం సిలబస్ పూర్తయినట్లు కాలేజీల యాజమాన్యం చెబుతోంది.
– దస్రూనాయక్, ఇంటర్మీడియట్ అధికారి
ముంచుకొస్తున్న పరీక్షలు.. పూర్తికాని పాఠాలు!


