
సాక్షి, యాదాద్రి: భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఓ పక్క పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. మరో పక్క నలుగురు కలిసిన చోట పందేల జోరు ఊపందుకుంది. రూ.1000 నుంచి రూ.లక్షల్లో బెట్టింగ్ వేస్తున్నారు. అంతేకాకుండా తమ పార్టీ అభ్యర్థి గెలిస్తే దావత్ చేస్తాం.. టూర్‌కు తీసుకెళ్తామంటూ పందేలు కాస్తున్నారు.
ఫలితాలపై జనంలో ఆసక్తి..
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యన హోరాహోరీ పోరు సాగింది. ఓటింగ్ జరిగి ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్ నిక్షిప్తమైన తరుణంలో ఓటింగ్ సరళి, గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. ఓట్లు వేసిన జనం మాతరం ఫలితాల కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అభ్యర్థులు గెలుపు ఓటములపై కోట్లలో పందేలు కాస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఏపార్టీకి విజయావకాశాలు ఉంటాయన్నది సూచనప్రాయంగా చెప్పడంతో ఓటర్లలో మరింత ఆసక్తి నెలకొంది.
జనగామ ఎన్నికలపై కూడా..
భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతోపాటు పొరుగునే ఉన్న హైదరాబాద్‌లో కూడా బెట్టింగ్ జోరు సాగుతోంది. మహిళలు, యువత, రాజకీయ గ్రామస్థాయి రాజకీయ పార్టీల నేతలు బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. ఈప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల, ఇతర వ్యాపార వర్గాల్లో కూడా అభ్యర్థుల జయాపజాయాలు ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు నియోజకవర్గాల ఫలితాలపై హైదరాబాద్, బెంగళూరు, ఆంఽధ్రాలో భారీగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఒకరోజు ఆగితే ఫలితాలు తేలనున్న నేపథ్యంలో బెట్టింగ్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. పొరుగున ఉన్న జనగామ అసెంబ్లీ ఎన్నికలపై కూడా జిల్లాలో బెట్టింగ్ సాగుతోంది. అక్కడ పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై ఐపీఎల్ స్థాయి బెట్టింగ్‌లు సాగుతున్నాయి.