ఓటరు చైతన్యానికి పోరాటం | Sakshi
Sakshi News home page

ఓటరు చైతన్యానికి పోరాటం

Published Wed, Nov 15 2023 1:34 AM

గోడలపై పోస్టర్‌ అంటిస్తున్న నవీన్‌కుమార్‌ 
 - Sakshi

ఆత్మకూరు(ఎం): ఓటరులో చైతన్యం తీసుకొచ్చేందుకు ఓ యువకుడు నడుం బిగించాడు. డబ్బు, మద్యం తీసుకోకుండానే ఓటు వేయాలని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాడు. పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నాడు. అతనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్‌(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన మెరుగు నవీన్‌కుమార్‌. గీత కార్మికుడు, సహజ కవి మెరుగు మల్లేశం–పద్మ దంపతుల కుమారుడు మెరుగు నవీన్‌కుమార్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేసి ప్రస్తుతం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని రెడ్డి ల్యాబ్‌లో పని చేస్తున్నాడు. ప్రతి ఎన్నికల్లో ధన ప్రభావం, మద్యం పంపిణీ విపరీతంగా జరుగుతుండంతో నిజమైన సేవా గుణం గల ప్రజా ప్రతినిధులు రావడం లేదని గుర్తించాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెరుగుతున్న అవినీతి, అభివృద్ధి పనుల్లో కనిపిస్తున్న అవినీతిని కట్టడి చేయాలనుకున్నాడు. ఎన్నికల్లో మద్యం, డబ్బు ముట్టకుండా ఓటు వేయాలంటే ఓటరులో చైతన్యం తేవాలనుకున్నాడు. దీంతో శ్రీఓటు–మాటశ్రీ పేరుతో పోస్టర్‌లను అచ్చువేయించాడు. ఉమ్మడి జిల్లా అధికారుల చేతుల మీదుగా ఆ పోస్టర్‌ను ఆవిష్కరింజేశాడు. ఆ పోస్టర్‌లను ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ముఖ్య కూడళ్ల వద్ద గోడలపై అంటిస్తూ ఓటరులో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ‘ఓటు వెయ్యి..అక్రమార్కుల తాటా తియ్యి’ అంటూ పుస్తకం రూపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు. వాల్‌ పోస్టర్ల ద్వారానే కాకుండా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు.

ఫ డబ్బు, మద్యం పంపిణీ

అడ్డుకోవడానికి యత్నం

ఫ పోస్టర్ల ద్వారా ప్రచారం

నిర్వహిస్తున్న నవీన్‌కుమార్‌

సేవా గుణం ఉన్న వారినే ఎన్నుకుంటారని..

ఓటరులో చైతన్యం తీసుకరావడం వల్ల నిజమైన సేవా గుణం ఉన్న నాయకుడినే ఎన్నుకుంటారని నా వంతుగా ప్రయత్నం చేస్తున్నా. మద్యం, డబ్బు పంపిణీతో దోచుకునే నాయకులే ప్రజా ప్రతినిధులుగా వస్తున్నారు. ఓటరు ఎప్పుడైతే నిస్వార్థంగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేస్తాడో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన అభివృద్ధి, నిజమైన సేవ మనకు కనిపిస్తుంది.

– మెరుగు నవీన్‌కుమార్‌

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement