
ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నల్లగొండ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానకాంతులు ప్రసరింపజేయాలనే తత్వాన్ని దీపావళి నేర్పుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, సిరిసంపదలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి :
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రజ లకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ, నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపేది కావాలని ఆకాంక్షించారు.
సీఎం సభాస్థలి పరిశీలన
హాలియా: హాలియాలోని దేవరకొండ రోడ్డు అనుముల వద్ద ఈనెల 14న జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్‌ఎస్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ ఎంసీ కోటిరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ శనివారం పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్, హెలిప్యాడ్ తదితర పనులను పరిశీలించి ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, అనుముల మండల ఎంపీపీ పేర్ల సుమతిపురుషోత్తం, తదితరులు ఉన్నారు.
ప్రలోభాలకు లొంగొద్దు
నకిరేకల్: ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రలభాలకు లొంగకుండా నిస్వార్థపరులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకునేందుకు అర్హులైన ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో శనివారం ఆ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లను చైతన్యపరిచేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గోపికృష్ణ, ఆర్‌ఐ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం
రామగిరి(నల్లగొండ): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్‌ఓ) వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి, కేశరాజుపల్లి గ్రామాలొంల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కాగానే ఆన్‌లైన్ డేటా ఎంట్రీ పూర్తి చేసి రైతులకు త్వరగా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం నాగేశ్వరరావు, ఆర్‌ఐ లింగస్వామి, ఏపీఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

