
పల్లె రవికుమార్
చండూరు : ఉమ్మడి జిల్లాకు మరో కార్పొరేషన్ పదవి దక్కింది. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవికుమార్‌గౌడ్‌ను రాష్ట్ర గీత కార్మిక సహకార, ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రవికుమార్ రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. రవికుమార్ తండ్రి పల్లె లింగయ్య బోడంగిపర్తి గ్రామానికి సీపీఐ నుంచి సర్పంచ్‌గా పనిచేశారు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పల్లె రవికుమార్ విద్యార్థి దశలోనే మునుగోడు నియోజకవర్గంలోని ఫ్లోరైడ్ సమస్య, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన కోసం పోరాడారు. వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. 2001లో టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించారు. ప్రస్తుతం ‘తెలంగాణ జర్నలిస్టుల ఫోరం’ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ‘పీపుల్స్ ఫౌండేషన్’ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రవికుమార్ తొలుత టీఆర్‌ఎస్ పార్టీలో పనిచేశారు. తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేశారు. రవికుమార్ సతీమణి కల్యాణి కాంగ్రెస్ నుంచి చండూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన మునుగోడు శాసనసభ ఉప ఎన్నిక సమయంలో వీరు తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరారు. రవికుమార్‌కు కార్పొరేషన్ పదవి దక్కడంపై మునుగోడు నియోజవర్గంలోని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర గీత కార్మిక సహకార, ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్‌గౌడ్
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్