ఏడాదిలోనే మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో 65 బస్సులు కేటాయింపు
అద్దె బస్సుల భారం తగ్గింది..
బస్సే పెట్టుబడి..
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రామీణ మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బస్సుల కేటాయింపుతో వారికి అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇప్పటికే సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ కింద తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తోంది. అలాగే ఏటా విద్యార్థుల యూనిఫాం కుట్టే (స్టిచ్చింగ్) పనిని సైతం అప్పగించిన విషయం విదితమే. ఇందులో భాగంగా అద్దె బస్సుల పథకం కింద ఏకంగా సెర్ప్ నుంచి రూ.30 లక్షల గ్రాంట్ రావడం.. దీనిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో మండల మహిళా సమాఖ్యలకు ఎంతో వెసులుబాటు కలిగింది. తమ వాటా కింద కేవలం రూ.6 లక్షలు మాత్రమే భరిస్తే చాలు ఏకంగా బస్సు యజమానులుగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. వీటిని ఆర్టీసీ 84 నెలల పాటు ఒక్కో బస్సును లీజుకు తీసుకుని ఏకంగా ప్రతి నెలా రూ.69,468 చొప్పున అద్దె రూపంలో చెల్లిస్తోంది. ఇక ఈ బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చులు సైతం సంస్థనే భరిస్తుండటంతో ఇది వారికి వరంగా మారింది. ఈ మొత్తం మండల మహిళా సమాఖ్య ఖాతాలో నేరుగా జమ అవుతుండటంతో అవసరమైన సభ్యులకు అత్యవసర సమయంలో కావాల్సిన రుణం ఇస్తూ ఎంతో ఆసరాగా నిలుస్తున్నారు.
డిపోల వారీగా బస్సుల కేటాయింపు ఇలా..
మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని పది డిపోలలో ప్రస్తుతం ఆర్టీసీవి చెందినవి 455, ప్రైవేట్ కాంట్రాక్టర్లవి 360, మండల మహిళా సమాఖ్యలవి 65, జేబీఎంవీ 23 ఇలా మొత్తం 903 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో షాద్‌నగర్ డిపోనకు 18, మహబూబ్‌నగర్‌కు 16, వనపర్తికి 14, నారాయణపేట, గద్వాలకు 4 చొప్పున, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌కు 2 చొప్పున; కోస్గికి 1 మండల మహిళా సమాఖ్యకు చెందిన బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకుంది. భవిష్యత్తులో సంస్థకు చెందిన బస్సులు ఎక్కడైనా కాలం (15 ఏళ్లు దాటిన) చెల్లినవి ఉంటే వాటి స్థానంలో మండల మహిళా సమాఖ్యల ద్వారానే కొత్త బస్సులు అద్దెకు తీసుకుని నడిపించనున్నారు.
షాద్‌నగర్ డిపో పరిధిలో
అత్యధికంగా 18
కొత్త బస్సుకు సెర్ప్ నుంచి రూ.30 లక్షల గ్రాంట్
మహిళా సమాఖ్య వాటా
రూ.6 లక్షలు.. ఆర్టీసీ నుంచి నెలకు రూ.69,468 అద్దె
అదనపు ఆదాయంతో ఆర్థికంగా చేయూత
ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెందిన అద్దె బస్సుకు ప్రతినెలా రూ.1.20 లక్షల నుంచి రూ.1.30 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోంది. అలాంటి రాష్ట్ర ప్రభుత్వమే మండల మహిళా సమాఖ్యలకు గ్రాంట్ కింద బస్సులు కొనుగోలు చేసి ఇస్తోంది. వీటికి అద్దె రూపంలో కేవలం రూ.69 వేల పైచిలుకు మాత్రమే చెల్లిస్తున్నాం. ఈ పథకం అమలుతో మా సంస్థకు అద్దె బస్సుల భారం తగ్గినట్లే. కాలం చెల్లిన బస్సుల స్థానంలో దశల వారీగా మండల సమాఖ్య బస్సులనే వినియోగిస్తాం. – పి.సంతోష్‌కుమార్, ఆర్‌ఎం, మహబూబ్‌నగర్ రీజియన్


