కందనూలు: పేదల సంక్షేమం, సుపరిపాలన, దేశ భద్రతే బీజేపీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25ఏళ్ల సుపరిపాలన పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభను జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వరకు వికసిత్ భారత్ సేవాజ్యోతి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వీరేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశాభివృద్ధి, పేదల సంక్షేమం, సుపరిపాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. భారత్‌ను ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టే దిశగా ముందుకెళ్తున్నారని అన్నారు. దేశంలో ఒకప్పుడు పేదరికం, అణగారిన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటికీ నేరుగా ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్‌ప్రసాద్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేశ్ ఆచారి, పట్టణ అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు.


