అచ్చంపేట/ కందనూలు: తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను జిల్లావాసులు గురువారం వైభవంగా జరుపుకొన్నారు. శ్రీపరాభవసు నామ సంవత్సరం తీపి, చేదు అనుభవనాలను మరిచి ఘన స్వాగతం పలికారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. గ్రామాల్లో వేకువజామునే చేలకు చేరిన అన్నదాతలు దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి సాగు పనులకు శ్రీకారం చుట్టారు. కొత్త దుస్తులు ధరించి నూతన సంవత్సరంలో అంతా శుభం కలగాలని దేవుడిని ప్రార్థించారు. పండితులు పంచాగ శ్రవణాలు చదువుతూ జిల్లా భవిష్యత్‌ను వివరించడంతోపాటు ప్రజలు తమతమ రాశి ఫలాలు, జాతక చక్రాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఆలయాల్లో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.
గ్రామాల్లో రైతులు వేకువజామునే పొలాలకు వెళ్లి అరక పూజలు చేసి.. నాగలి తోలి వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. గోవులను అలకరించి పూజలు చేసి పొలాల్లో ఐదుసార్లు నాగలిసాళ్లు పట్టించారు. ఇలా చేయడం వల్ల పాడి పంటలు బాగా పండుతాయని రైతులు నమ్ముతారు. చిరుధాన్యాలను పొలాల్లో చల్లి దేవుడికి కొబ్బరికాయ కొట్టి, నైవేద్యం పెట్టారు. వివిధ కులవృత్తుల వారు వస్తువులకు, పరికరాలకు పూజలు చేశారు.


