కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీలో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, మున్సిపాలిటీ సూచించిన వాటికి అణుగుణంగా వేలం పాటలో దక్కించుకున్న వాటిని వసూళ్లు చేయాలని మున్సిపల్ చైర్మన్ రత్నమాల ఆనంద్‌కుమార్ అన్నారు. బుధవారం మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రతి ఏటా నిర్వహించే పశువుల సంత, తైబజార్, వధశాల, మాంసపు వ్యర్థాల కొరకు నిర్వహించే వేలం పాటను వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్‌తో కలిసి నిర్వహించారు. ఈ ఏడాది వేలంలో తైబజార్‌ను సతీష్ కుమార్ రూ.32.01 లక్షలకు దక్కించుకోగా, గతేడాది రూ.25 లక్షలకు పోగా, రూ.7.01 లక్షలకు ఎక్కువ ఆదాయం మున్సిపాలిటీకి చేరింది. పలు మాంసపు వ్యర్థ్యాలకు గాను రూ.20.50 లక్షలు వేలం పాటలో మల్లేష్ దక్కించుకోగా, గతేడాది రూ.5లక్షలు మాత్రమే పోగా, మున్సిపాలిటీకి రూ.15 లక్షలు ఆదాయం ఎక్కువగా వచ్చింది. వధశాలకు గతేడాది ఎవ్వరికి వేలంలో పాల్గొగనకపోగా, ఈ ఏడాది శివాజీ రూ.1.5లక్షలకు దక్కించుకున్నారు. పశుశుల సంతకు గాను గతేడాది ఎవ్వరూ వేలానికి రాకపోగా మున్సిపాలిటీ సిబ్బంది నిర్వహించగా, ఈ ఏడాది సైతం ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో వేలాన్ని వాయిదా వేసిన అధికారులు, తిరిగి పశువుల సంతకు వేలం పాటను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. వేలం పాటలో మున్సిపల్ రెగ్యులర్ సిబ్బంది నిలబడి, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కుర్చీలలో కూర్చొని ఉండటంపై మున్సిపల్ సిబ్బందే పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ ప్రధాన అధికారులు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యాలయంలో జోరుగా సాగుతున్న చర్చ బహిరంగ చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహామూద్ షేక్, మేనేజర్ రాజకుమారి, ఏఈ షబ్బీర్, మున్సిపల్ సిబ్బంది, వేలం పాట దారులు పాల్గొన్నారు.


