కందనూలు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ అమరేందర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ముఖ్యంగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి పట్టించుకోకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. అలాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు రాక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని, వీధిదీపాల ఏర్పాటు, మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. సర్వారెడ్డి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ ఏరియాను అభివృద్ధి చేసి పనులు ప్రారంభించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్‌కు భూమి యాక్టివేషన్ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్‌ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


