
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
అచ్చంపేట రూరల్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో కార్యాచరణ అమలు చేస్తోందని, వారి ఆర్థికాభివృద్ధికి కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం అచ్చంపేటలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఇందిరమ్మ కలను సాకారం చేసే దిశగా మహిళా సంఘాలను అన్ని విధాలుగా బలోపేతం చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత ద్వారానే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయన్నారు. మహిళల ఆలోచనా విధానాలు మారాలని, వృథా ఖర్చులను తగ్గించి కుటుంబ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పభుత్వం మహిళల అభివృద్ధికి స్వయం సహాయక సంఘాల ద్వారా రూ.వేల కోట్లతో వడ్డీ లేని రుణాలు ఇస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లను మంజూరు చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుందన్నారు. పిల్లల చదువుల పేరుతో రూ.లక్షలు వృథా చేయకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం మహిళా సంఘాలనే మరచిపోతే.. తమ ప్రభుత్వం ప్రతి మహిళా సంఘానికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందిస్తుందన్నారు. అనంతరం 721 స్వయం సహాయక సంఘాలకు రూ.51.32 కోట్ల చెక్కును మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, ఎమ్మెల్యే సతీమణి అనురాధ, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రజిత, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, నాయకులు గిరివర్ధన్‌గౌడ్, సునీతరెడ్డి, గౌరీశంకర్, శారద, సుశీల తదితరులు పాల్గొన్నారు.