
బీజేపీలో రగడ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: క్రమశిక్షణకు పెద్దపీట వేసే భారతీయ జనతా పార్టీకి సంబంధించి పాలమూరులో ఇటీవల చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు కలకలం సృష్టిస్తున్నాయి. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ మధ్య ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో బహిరంగ సమావేశం వేదికగా అంతర్గత పోరు రచ్చకెక్కగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శాంతికుమార్ గో బ్యాక్ అంటూ డీకే అనుచరుల నినాదాలు.. వేదికపై ఆయననుద్దేశించి అరుణ పరోక్షంగా మాట్లాడిన మాటలు పార్టీలో చిచ్చు రాజేశాయి. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన శాంతికుమార్ స్తబ్దుగా ఉండగా.. ఆయన అనుచరులు మాత్రం మండిపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ వాదం తెరపైకి రాగా.. పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. రానున్న స్థానిక ఎన్నికల వేళ నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామ, మండల, పట్టణ స్థాయి నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
2019 నుంచీ కోల్డ్‌వార్..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గద్వాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా డీకే అరుణ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆమెకు పరాజయం ఎదురైంది. అనంతరం రాజకీయ పరిణామాల క్రమంలో ఆమె పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమెతోపాటు శాంతికుమార్ టికెట్ ఆశించారు. బీజేపీని గెలిపించాలని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు వెలిశాయి. పోటీగా డీకే అరుణ వర్గం కూడా ఆమె ఫొటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇలా అప్పటి నుంచే ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇక 2024 ఎంపీ ఎన్నికల్లో సైతం ఇద్దరూ టికెట్ ఆశించారు. బీజేపీ అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గు చూపగా.. ఆమె పోటీ చేసి గెలుపొందారు. ఇలా రెండు పర్యాయాలు శాంతికుమార్‌కు టికెట్ వచ్చినట్లే వచ్చి చివరలో చేజారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలో జరిగిన పరిణామాలపై పార్టీ శ్రేణుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు శాంతికుమార్ కుట్ర చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆమె వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి పనిచేయకుండా రాజీనామా చేసిన వారిని ఆయన సమావేశానికి తీసుకొచ్చారని.. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. తాము ఎవరి వర్గం కాదని.. పార్టీకి రాజీనామా చేసిన వారు సమావేశానికి రావడంతో ప్రశ్నించినట్లు కొందరు చెబుతున్నారు. ఇదే క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణపేట, మక్తల్, గద్వాలలో డీకే అరుణ తన కుటుంబ సభ్యుల కోసం బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని.. ఆమె అవకాశవాద రాజకీయ పోకడలతో విసిగి ఇద్దరు, ముగ్గురు ముఖ్య నేతలు పార్టీని వీడారని ఆరోపిస్తున్నారు. పాలమూరులో బీజేపీ బలోపేతానికి శాంతికుమార్ ఎంతో కష్టపడ్డారని.. ఆయనకు రెండు సార్లు ఎంపీ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని.. అయినా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తన సమక్షంలో జరిగిన ఈ ఘటనను ఖండించకపోవడం.. తన ప్రసంగంలో శాంతికుమార్ పేరును ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. రెండు వర్గాలుగా విడిపోయిన ఎంపీ డీకే అరుణ, శాంతికుమార్ అనుచరులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఎదుటే బాహాబాహీకి దిగారు. శాంతికుమార్‌ను వేదికపై రాకుండా డీకే వర్గం యత్నించడంతోపాటు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా శాంతికుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఆయన అనుచరులు నినదించారు. ఈ క్రమంలో పలువురు నాయకులు కలుగుజేసుకుని గొడవ సద్దుమణిగించారు. ఆ తర్వాత డీకే అరుణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ఓడించేందుకు పనిచేశారని.. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పరోక్షంగా శాంతికుమార్‌ను ప్రస్తావిస్తూ రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు. ఈ పరిణామాలతో శాంతికుమార్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు.
అరుణ శాంతికుమార్
బీసీ సంఘాల ఆగ్రహం..
బీజేపీలో తాజా పరిణామాల క్రమంలో బీసీ వాదం తెరపైకి వచ్చింది. మున్నూరు కాపు వర్గానికి చెందిన శాంతికుమార్‌ను డీకే అరుణ అవమానించారని.. ఇది తగదంటూ పలు సంఘాలు భగ్గుమంటున్నాయి. బీసీ సమాజానికి ఆమె క్షమాపణ చెప్పేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. లేకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని బీసీ సమాజ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం, బీసీ మేధావుల సంఘం, మున్నూరు కాపు సంఘం నేతలు హెచ్చరిస్తున్నారు.
శ్రేణుల్లో భిన్న స్వరాలు..
గో బ్యాక్ నినాదాలు.. మాటల తూటాలు
సీనియర్ల మండిపాటు..
పార్టీలో లోటుపాట్లు, నేతల మధ్య విభేదాలపై అంతర్గత వేదికలపైనే చర్చించుకోవడం.. సమస్యలను పరిష్కరించుకోవడం బీజేపీకి ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న తర్వాత రాంచందర్‌రావు తొలిసారి చేపట్టిన జిల్లా పర్యటనలో నేతల మధ్య విభేదాలు బహిరంగ సమావేశంలో రచ్చకెక్కడంపై ఆ పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో కొత్త సంప్రదాయానికి తెరలేపారని.. ఇది మంచి పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఆదిలోనే కట్టడి చేయాలని.. లేకుంటే మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం వాటిల్లేలా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని.. పార్టీ అధిష్టానం దృష్టిసారించి సమస్య సద్దుమణిగేలా చూడాలని కోరుతున్నారు.
నేతల మధ్య రచ్చకెక్కిన అంతర్గత పోరు
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సమక్షంలోనే బహిర్గతం
చిచ్చురేపిన డీకే మాటలు.. మనస్తాపానికి గురైన శాంతికుమార్?
ఎంపీ అనుచరుల గోబ్యాక్ నినాదాలపై పార్టీలో భిన్నస్వరాలు
తెరపైకి బీసీ వాదం.. ‘కమలం’ శ్రేణుల్లో అయోమయం
‘స్థానిక’ ఎన్నికల వేళ నష్టం వాటిల్లుతుందని ఆందోళన