అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Jul 29 2025 4:40 AM | Updated on Jul 29 2025 9:06 AM

అర్జీ

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

నాగర్‌కర్నూల్‌: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. నేటి ప్రజావాణికి 50 దరఖాస్తులు వచ్చాయని.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

పోలీసు ప్రజావాణికి 14 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని ప్రజలు నేరుగా కలిసి వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయని.. ఇందులో 8 భూతగాదా, 5 తగు న్యాయం చేయాలని, ఒకటి భార్యాభర్తల గొడవపై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

డిగ్రీ కళాశాల మైదానాన్ని అప్పగించాలని ధర్నా

కందనూలు: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల మైదానాన్ని తిరిగి కళాశాలకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో శ్రీపురం రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ వర్కింగ్‌ కమిటీ సభ్యురాలు సౌమ్య మాట్లాడుతూ.. కళాశాల మైదానాన్ని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ భూమిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి కళాశాలకే చెందే విధంగా చూడాలని కోరారు. లేనిపక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కాగా, గంటపాటు జరిగిన ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ గోవర్ధన్‌ అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘం నాయకులకు నచ్చజెప్పారు. అనంతరం రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారుబాబు, జిల్లా కన్వీనర్‌ శివశంకర్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌ ప్రసాద్‌కుమార్‌, కళాశాల అధ్యక్షుడు శివ, లావణ్య, పల్లవి, బిందు, కృష్ణవేణి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

బిజినేపల్లి: మండలంలోని వట్టెం జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి గాను విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ పి.భాస్కర్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు నవోదయ వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం నవోదయ విద్యాలయం లేదా ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాధికారుల కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

కేజీబీవీల్లో ఇంటర్‌

ప్రవేశానికి అవకాశం

కందనూలు: జిల్లాలోని 20 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫస్టియర్‌లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సుల్లో సీట్ల ఖాళీలు ఉన్నాయని.. ఆసక్తిగల విద్యార్థినులు ఈ నెల 30వ తేదీలోగా ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఆయా కేజీబీవీల ప్రత్యేకాధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు 1
1/2

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు 2
2/2

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement