కార్మికులకు ‘సఫాయి సురక్ష’ | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు ‘సఫాయి సురక్ష’

Jul 28 2025 12:24 PM | Updated on Jul 28 2025 12:24 PM

కార్మ

కార్మికులకు ‘సఫాయి సురక్ష’

కల్వకుర్తి టౌన్‌: మున్సిపాలిటీల్లో పోగయ్యే చెత్తను ప్రతిరోజు సేకరించి.. మురుగు కాల్వలో పేరుకుపోయే మురుగు తొలగిస్తూ.. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు.. వారు మాత్రం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో వారికి అటు ఆరోగ్యం.. ఇటు సంక్షేమం రెండింటిని వారికి అందించేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల కోసం సఫాయి సురక్ష పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్య వివరాలను అందజేయాలని ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు వాటిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ (నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి, అచ్చంపేట)ల్లో 212 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు.

పీఎఫ్‌, ఈఎస్‌ఐ..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పూర్తి వివరాలను శానిటేషన్‌ విభాగంలో పనిచేసే అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. పూర్తి వివరాలు సేకరించాక కార్మికులకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సఫాయి సురక్ష అమలుకు కార్మికుల ఆరోగ్య వివరాలను వారి వద్ద నిక్షిప్తం చేసి ఉంచనున్నారు. కార్మికులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సక్రమంగా వర్తింపజేసేలా శానిటేషన్‌ విభాగం అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నారు. గతంలో కొన్ని మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను కాంట్రాక్టు సంస్థలకు సంబంధించిన ఏజెన్సీలు ఇచ్చేవి. అయితే ఆయా ఏజెన్సీలు వారికి అందజేసే జీతంలోనే పీఎఫ్‌, ఈఎస్‌ఐ కట్‌ చేసి మిగతా సొమ్మును కార్మికులకు సంబంధించిన అకౌంట్లలో జమ చేసేవారు. వారంతా ఈ పక్రియను సక్రమంగా నిర్వర్తించారా.. లేదా.. అన్న విషయాలను సైతం మున్సిపల్‌ అధికారులు ఆరా తీసి వాటిని సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోనున్నారు.

అవగాహన కల్పిస్తాం..

మున్సిపాలిటీలో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న కార్మికులకు సఫాయి సురక్ష పథకాన్ని అమలు చేసేందుకు వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. వారి ఆరోగ్య వివరాలతోపాటు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. కార్మికులు అందరికీ ఆరోగ్య పరిరక్షణ కిట్లను అందజేస్తాం. – మహమూద్‌ షేక్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కల్వకుర్తి

ఆరోగ్య పరిరక్షణ కిట్లు..

మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఏటా ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరిరక్షణ కిట్లను అందజేసేవారు. అదే మాదిరిగా సఫాయి సురక్ష పథకం ద్వారా కూడా కార్మికులందరికీ కచ్చితంగా ఆరోగ్య పరిరక్షణ కిట్లలో ఉండే చేతికి గ్లౌజులు, కాళ్లకు పొడవాటి బూట్లు, తలకు రక్షణ హెల్మెట్లను పంపిణీ చేయనున్నారు. కొంతకాలంగా వీటిని సక్రమంగా అందించకపోవడంతో కార్మికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యులు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. వైద్య శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించి చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అక్కడే మందులను ఇస్తారు. ఏదైనా వ్యాధి ఉన్నట్లు తేలితే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించనున్నారు.

మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య సిబ్బంది కోసం ప్రత్యేక పథకం

స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా అమలుకు చర్యలు

కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిస్థితులపై వివరాల సేకరణ

మెడికల్‌ కిట్లు పంపిణీ చేయనున్న అధికారులు

కార్మికులకు ‘సఫాయి సురక్ష’ 1
1/1

కార్మికులకు ‘సఫాయి సురక్ష’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement