
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన
నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, అందుకే రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని 98 జీఓ భూ నిర్వాసితుల గురించి ఎప్పుడైనా ఆరోచించారా అని ప్రశ్నించారు. కొడంగల్‌లో కొబ్బరికాయ కొట్టడం తప్ప పనులే కావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఏమైందో సీఎం చెప్పాలన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండాను గ్రామ గ్రామాన ఎగురవేయాలని, ఇందుకోసం కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని చెప్పారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మోదీ ఇవ్వడం లేదని ఎందుకు చెప్పాలన్నారు. మోదీ ఇచ్చేది ఉంటే నువ్వెందుకు హామీ ఇవ్వాలని అన్నారు. ముందు తెలంగాణ క్యాబినెట్‌లో 42 శాతం మంత్రులు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రాములు మాట్లాడుతూ కార్యకర్తలు ఎంత పనిచేస్తే పార్టీ అంత ఎదుగుతుందని, ప్రతి కార్యకర్త గ్రామాల్లో నాయకుడిగా ఎదగాలని కోరారు. సమావేశంలో నాయకులు ఎల్లేని సుధాకర్‌రావు, దిలీపాచారి, భరత్‌ప్రసాద్, మంగ్యానాయక్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్ పాయిజన్‌పై విచారణ జరిపించాలి
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతున్నాయో వవిచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. సీఎం సొంత జిల్లాలోనే విద్యార్థులకు అన్నం పెట్టలేకపోతున్నారని ఆరోపించారు. పాలమూరుకు రూ.లక్ష కోట్లు, కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పిన సీఎం హామీ ఏమైందో చెప్పాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత గ్రామానికి నాలుగు లైన రోడ్డు వేసుకున్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదని ఎద్దేవా చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు