
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
కందనూలు: జిల్లాలో గ్రామ పాలనాధికారి, లైసెన్సుడు సర్వేయర్ల ఎంపిక రాత పరీక్ష ప్రశాంతంగా కొనసాగిందని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. జీపీఓ పరీక్ష కోసం మొత్తం 66 మంది అభ్యర్థులకు గాను 55 మంది హాజరు కాగా 11 మంది గైర్హాజరయ్యారు. జీపీఓ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది. అలాగే లైసెన్స్‌డు సర్వేయర్ పరీక్ష కోసం 235 మంది అభ్యర్థులకు గాను 190 మంది హాజరు కాగా 45 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు నిర్వహించారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రైతులకు సాగునీరు అందిస్తాం
వెల్దండ: కేఎల్‌ఐ కాల్వ ద్వారా త్వరలోనే రైతులకు సాగునీరు అందిస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండాల వద్ద కేఎల్‌ఐ కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎల్‌ఐ కాల్వలో పెరిగిన చెట్లను తొలగించాలన్నారు. ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కొల్లాపూర్ వద్ద సాగునీరు విడుదల చేశామని, త్వరలోనే వెల్దండ మండలానికి సాగునీరు వస్తుందన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వెల్దండ నుంచి సిర్సనగండ్ల వరకు నిర్మిస్తున్న రెండు వరుసల రోడ్డు విస్తరణపై గుండాల ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. గుండాల వద్ద మూల మలుపులు ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, కాబట్టి గుండాల వద్ద కేఎల్‌ఐ కాల్వ సమీపం నుంచి బైరాపూర్ వెళ్లే దారిలో మూలమలుపులు లేకుండా బీటీరోడ్డు నిర్మించేలా చూడాలని, ఇలా చేయడం వల్ల ఆలయానికి కూడా మంచి జరుగుతుందని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఆర్‌అండ్‌బీ అధికారులతో సర్వే చేయించి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, పర్వత్‌రెడ్డి, వెంకటయ్యగౌడ్, రామకృష్ణ, కృష్ణారెడ్డి, అలీ, రషీద్, ఆలయ కమిటీ వైస్ చైర్మెన్ అరుణ్‌నాయక్, డైరెక్టర్ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కందనూలు: షాద్‌నగర్‌లోని నూర్ కళాశాలలో ఉన్న నాగర్‌కర్నూల్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శైలజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీజెడ్‌సీ, ఎంజెడ్‌సీ, ఎంఎస్‌సీఎస్, ఎంపీసీఎస్, బీకాం, బీఏ గ్రూపులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 31లోగా అడ్మిషన్ తీసుకోవచ్చని చెప్పారు. పూర్తి వివరాలకు సెల్ నం.83746 31969ను సంప్రదించాలని సూచించారు.

ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష