కందనూలులో కలకలం | - | Sakshi
Sakshi News home page

కందనూలులో కలకలం

Jul 28 2025 12:24 PM | Updated on Jul 28 2025 12:24 PM

కందనూలులో కలకలం

కందనూలులో కలకలం

ఉయ్యాలవాడలోని బీసీ గురుకుల పాఠశాలలో 64 మంది విద్యార్థినులకు అస్వస్థతత

కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక

గడువుతీరిన పాలు,పెరుగు వల్లే ఘటన

ఉడకని భోజనం, నాసిరకం సరుకుల వినియోగం

జిల్లాలోని అన్నిచోట్ల ఇష్టారాజ్యంగా క్యాటరింగ్‌ నిర్వహణ?

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో ఆస్పత్రిలో చేరిన ఘటన కలకలం సృష్టించింది. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అస్వస్థతతకు గురైన విద్యార్థినులు 64 మందిని జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స అందించిన వైద్యులు ఆదివారం సాయంత్రానికి డిశ్చార్జి చేశారు. అయితే పాఠశాలలో వంట కోసం వినియోగించిన సరుకులు నాసిరకంగా ఉండటం, గడువు తీరిన పాలు, పెరుగు పదార్థాలను వినియోగించడం వల్లనే ఫుడ్‌ పాయిజన్‌ చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పాఠశాలకు సంబంధించిన క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌ బయట నుంచి పాలు, పెరుగు డబ్బాలను కొనుగోలు చేసి విద్యార్థినులకు వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో నిర్ణీత కాలం పాటు, రెండు, మూడు రోజుల్లోపే వినియోగించాల్సిన పాలు, పెరుగు డబ్బాలను ఎక్స్‌పైరీ తేదీ దాటినా వినియోగించడంతోపాటు ప్రధానంగా పెరుగన్నం తిన్న విద్యార్థినులు అస్వస్థతతకు గురైనట్లు తెలిసింది.

అమలుకాని మెనూ..

జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లలో ఎక్కడా డైట్‌ మెనూ సరిగా అమలుకావడం లేదు. ఉదయం పూట టిఫిన్‌ కింద పూరి, ఇడ్లి, చపాతి, దోశ ఇవ్వాల్సి ఉండగా.. చాలాసార్లు లెమన్‌ రైస్‌, కిచిడీ, పులిహోరతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో మిక్స్‌డ్‌ వెజ్‌ బిర్యానీ, రెండేసి కూరలతో వడ్డించాల్సి ఉండగా.. పప్పులు, సాంబారుతో నెట్టుకొస్తున్నారు. వారంలో చికెన్‌, గుడ్డు, స్నాక్స్‌ విషయంలో కోత విధిస్తున్నారు. వంట గదుల్లో శుచి, శుభ్రత పాటించకపోవడం, శుభ్రమైన నీటిని వినియోగించకపోవడంతో తరుచుగా ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గురుకుల హాస్టళ్ల నిర్వహణపై క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement