సాగునీటి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

సాగునీటి కష్టాలు

Oct 14 2026 4:17 AM | Updated on Oct 14 2026 4:17 AM

మండుతున్న ఎండలు.. విద్యుత్‌ కోతలతో ఎండుతున్న పంటలు

ములుగు: జిల్లాలోని 10 మండలాల పరిధిలో 94,160 ఎకరాల్లో వరిపంటను రైతులు సాగు చేశారు. ఎల్‌నినో ప్రభావంతో మండుతున్న ఎండలతో పాటు భూ గర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీనికి తోడు విద్యుత్‌ కోతలు వెంటాడుతుండడంతో అన్నదాతలకు సాగు నీటి కష్టాలు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో పంటలకు నీటి అవసరం అధికమవుతోంది. బోర్ల కింద సాగు చేసిన పంటలకు సకాలంలో నీటి తడులు అందించలేక రైతులు సతమతమవుతున్నారు. మరికొన్ని చోట్ల వర్షాధారాన్ని నమ్ముకొని వేసిన పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా పొట్టదశలో ఉన్న వరి పంటకు సాగునీరు అందకపోతుండడంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు.

సాగు మొదలైనప్పటి నుంచి కష్టాలే..

ఈ వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచే రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో సాగు పనులకు తొలుత ఆటంకాలు ఏర్పడ్డాయి. వర్షాల కోసం ఎదురుచూసినప్పటికీ ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు చెప్పినప్పటికీ రైతులు వరిపంట వైపే మొగ్గుచూపారు. ఆలస్యంగా వరిపంటను సాగు చేసినప్పటికీ అప్పుడప్పుడు కురిసిన వర్షాలతో రైతులు పంటలను కాపాడుకుంటూ వచ్చారు. వర్షాలు లేకపోవడంతో చెరువులు, కుంటల్లోకి పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టడంతో బోర్లపై ఆధారపడిన రైతులకు సాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎండల తీవ్రత పెరగడం, విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తుండడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గుతుండడంతో బోర్లలో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా మారింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బోర్లు పోయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొట్టదశలో వరిపంట..

ప్రస్తుతం వరి పంట పొట్టదశలో ఉంది. వరి పంటలో ఈ దశ కీలకమైనది కావడంతో తగినంత నీరు అందించడం అవసరం. ఈ సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే కంకుల అభివృద్ధి, ధాన్యం గింజలు తక్కువగా ఉండే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఎదురుకావడం వారిని కలవరపెడుతోంది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి అదనపు ఖర్చులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల పాటు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేసిన అధికారులు ప్రస్తుతం కోతలు విధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. దీంతో విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉంది. రోజుకు 7గంటలు మాత్రమే త్రీఫేజ్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తుండడంతో పంటలు పండే పరిస్థితి కనిపించడం లేదని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే తప్పా పంటలు చేతికొచ్చే అవకాశాలు లేవని రైతులు వాపోతున్నారు.

వర్షాభావానికి తోడు

అడుగంటుతున్న భూగర్భజలాలు

పొట్టదశలో ఉన్న వరిపంట

కాపాడుకునేందుకు ఇబ్బందులు

పడుతున్న అన్నదాతలు

జిల్లాలో 94,160 ఎకరాల్లో వరిసాగు

6 గంటలు మాత్రమే త్రీఫేజ్‌ విద్యుత్‌

వ్యవసాయానికి 12గంటల పాటు నిరంతరం విద్యుత్‌ను అందించాల్సిన అధికార అధికారులు కేవలం 6 నుంచి 7గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఏడు ఎకరాల్లో వరిపంటను సాగు చేశాను. బోర్లలో సరిపడా నీరు ఉన్నప్పటికీ విద్యుత్‌ కోతలతో పంటపొలాలకు సరిపడా నీరు అందడం లేదు. త్రీఫేజ్‌ విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పోయినప్పుడల్లా అరగంట నుంచి గంటకు పైగా పోతుంది. విద్యుత్‌ అధికారులు, సిబ్బంది కొరత కారణంగా రైతులే విద్యుత్‌ ఫీజులు, ఇతర చిన్న చిన్న సమస్యలను సరిచేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదు. 12 గంటల పాటు విద్యుత్‌ను అందిస్తేనే పంటలు చేతికందే అవకాశాలు ఉన్నాయి.

– పంబిడి శ్రీధర్‌రావు, వెంకటాపురం(ఎం)

నాలుగుసార్లు రిపేరు చేయించాం..

ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైపోయింది. నాలుగు సార్లు రిపేరు చేయించాం.. అయినా కరెంటు ఆగడం లేదు. తరుచూ కాలిపోతుంది. నీరు లేక పంట పొలం ఎండిపోతుంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ త్వరగా రిపేరు చేయాలి.

– దాసరి వెంకటేశ్వర్లు, రైతు, ఏటూరునాగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement